కేసీఆర్ ​హామీలన్ని.. ఎన్నికల స్టంట్

కేసీఆర్ ​హామీలన్ని.. ఎన్నికల స్టంట్
  • వరదలతో జనం విలవిల్లాడుతుంటే.. మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తడా
  • రాష్ట్రాన్ని కేసీఆర్​ ఫ్యామిలీ లూటీ చేస్తున్నది
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల స్వీకారం

హైదరాబాద్, న్యూఢిల్లీ, వెలుగు: ‘‘తొమ్మిదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను ఏనాడూ పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఇప్పుడు వాటిని నెరవేరుస్తానంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఎత్తులు వేస్తున్నరు” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో ఈ మభ్యపెట్టే డ్రామాలకు తెరదీశారని విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రుణమాఫీ, పీఆర్సీ, లక్ష ఆర్థికసాయం వంటి హామీలన్ని ఎన్నికల స్టంట్ లో భాగమేనని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్​ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత హైదరాబాద్​పార్టీ స్టేట్ ఆఫీసుకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సర్కార్ ఖజానాలో నయాపైసా లేదు. ఎన్నికల తాయిలాల కోసం విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. గడువు ముగియకముందే మద్యం టెండర్లను పిలిచి వేల కోట్లు పోగేసుకునే పనిలో పడ్డారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల పక్షాన తాము పోరాడుతుంటే.. పచ్చని ఇంట్లో పాము దూరి కాటేసినట్లుగా.. కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతూ ప్రజల భవిష్యత్తును చీకటిమయం చేస్తున్నదని ఆరోపించారు.

భావితరాలను మోసం చేస్తున్నరు

‘‘రాష్ట్రంలో వర్షాలు, వరదలతో గూడు కోల్పోయి, పంట నష్టపోయి ప్రజలు, రైతులు విలవిల్లాడుతుంటే.. ప్రత్యేక విమానంలో మహారాష్ట్రకు పోయి కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నరు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తే సీఎంను గల్లాపట్టి నిలదీస్తారనే భయంతోనే పరామర్శకు వెళ్లడం లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని చెప్పిన కేసీఆర్.. ఎన్నికలొస్తున్నయని విలీన జపం చేస్తూ ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తున్నడు. గడువు ముగియకముందే లిక్కర్​షాపులకు టెండర్లు పిలిచి వేల కోట్ల రూపాయలు దోచుకోవాలనుకుంటున్నడు. హైదరాబాద్ చుట్టపక్కల ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ భావితరాలను మోసం చేస్తున్నడు” అని సంజయ్ మండిపడ్డారు.

చావోరేవోతేల్చుకోవాల్సిన సమయం

బీజేపీ గ్రాఫ్ తగ్గిందని, పార్టీలో గ్రూపులున్నాయనేది పార్టీని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమని సంజయ్​అన్నారు. ప్రజలు మాత్రం బీజేపీ పక్షానే ఉన్నారని చెప్పారు. ‘‘నాపై విశ్వాసం ఉంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు. క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలా, సైనికుడిలా పార్టీ కోసం పనిచేస్త. కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను వృథా చేయబోం. ఎన్నికల యుద్ధంలో ఉన్నం. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమిది. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తం” అని అన్నారు. కాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

సంజయ్ పాదయాత్రతో  పార్టీ బలోపేతం: వివేక్

ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా సంజయ్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర తెలంగాణలో పార్టీ బలోపే తానికి పునాది వేసిందన్నారు. బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలిపారన్నారు. ఈ కొత్త బాధ్యతతో తెలంగాణలో సంజయ్ సేవలను పార్టీ మరింత ఎక్కువ వాడుకునే చాన్స్​ ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, పార్లమెంట రీ పార్టీ కార్యాలయ మాజీ కార్యదర్శి కామర్స్ బాలసుబ్రమణ్యం, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాషా, నేతలు సూదగాని హరిశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.