- ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలున్నా..
- ఎందుకు అరెస్టు చేయట్లేదు: బండి సంజయ్
- అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది
- కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఈ సర్కారుకు లేదు
- ముడుపులు దండుకునేందుకే విచారణను సాగదీస్తున్నరు
- కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛనివ్వాలని వ్యాఖ్య
కరీంనగర్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసినఅరాచకాలు గుర్తుకు వస్తే.. తన రక్తం మరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. డ్రోన్ ఎగరేశారని అరెస్ట్ చేసి.. బిడ్డ పెండ్లికి వెళ్లకుండా చేసినా.. రేవంత్ రెడ్డికి పౌరుషమే లేదని.. వాళ్లపై చర్యలు తీసుకోవడానికి ఆయనకు చేతకావడం లేదని విమర్శించారు. కరీంనగర్ లో శుక్రవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలోనూ ఆ ఆధారాలు, సాక్ష్యాలు చూపించారని.. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనేలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపులు కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని, విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌస్ నుంచి ఏఐసీసీకి ముడుపులు వెళుతున్నాయని ఆరోపించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వారికి స్వేచ్ఛనివ్వాలని సూచించారు.
ఫోన్లు ట్యాప్‌చేసి కోట్లు దండుకున్నరు..
ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయని సంజయ్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులు, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారని పేర్కొన్నారు. తన ఫోన్లను, ప్రస్తుత సీఎం, మంత్రుల ఫోన్లతోపాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసిందన్నారు.‘‘అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడమేంటి? రెండేండ్ల విచారణలో సిట్ సాధించిందేమిటి? ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? ఎన్ని ఆస్తులు జప్తు చేశారు? ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు? అసలు కేటీఆర్ ను విచారణకు ఎందుకు పిలిచారు? ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా? లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పడానికి పిలిచారా? సిరిసిల్ల కేంద్రంగా వార్ రూంను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని నేను చాలా సార్లు చెప్పిన. కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారు. బ్రిటిష్ పాలన తరహాలో పాలన చేశారు”అని మండిపడ్డారు. తనను సిట్ విచారణకు పిలిచి 6 నెలలైందని, మావోయిస్టు జాబితాలో తన నెంబర్ ఉంచి ఫోన్ ట్యాప్ చేశారని పోలీసులే చెప్పారని గుర్తు చేశారు.
