కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. మూడు నెలలకోసారి జీతాలు : బండి సంజయ్

కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. మూడు నెలలకోసారి జీతాలు :  బండి సంజయ్
  • కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. మూడు నెలలకోసారి జీతాలు
  • సిర్పూర్, సిరిసిల్ల ప్రచారంలో బండి సంజయ్

కాగజ్ నగర్/రాజన్న సిరిసిల్ల, వెలుగు : కేసీఆర్ మళ్లీ గెలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్లకు మూడు నెలలకోసారి జీతాలిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేశారని మండిపడ్డారు. ఒకటో తారీఖున జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. కుమ్రంభీం జిల్లా సిర్పూర్(టి)లో నిర్వహించిన విజయ సంకల్ప సభతో పాటు సిరిసిల్ల రోడ్​షోలో సంజయ్ మాట్లాడారు. ‘‘జీవో 317తో టీచర్లను కేసీఆర్ చెట్టుకొకరు.. పుట్టకొకర్ని చేసిండు. 

బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులంతా ఎంతో గోస పడ్తున్నరు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలుచుకుంటే కేసీఆర్​కు బుద్ధి చెప్పొచ్చు”అని సంజయ్ అన్నారు. సర్కార్ ఉద్యోగం వస్తే తమ జీవితాలు బాగుపడ్తాయని పుస్తెలు అమ్మి వేలాది మంది తల్లులు తమ బిడ్డలను చదివించారని తెలిపారు. పేపర్ లీకేజీలతో 50 లక్షల నిరుద్యోగుల జీవితాలను ఈ సర్కారు నాశనం చేసిందన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ చేసింది దొంగ దీక్ష. గంటకోసారి బయటకు వెళ్లి.. తిని, తాగి వచ్చి దీక్షలో కూర్చున్నడు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అవుతడు. కాంగ్రెస్​కు ఓటేస్తే బీఆర్ఎస్​కు వేసినట్టే’’ అని అన్నారు. ఇటీవల కేసీఆర్ చేసింది రాజశ్యామల యాగం కాదని, వశీకరణ పూజలని ఆరోపించారు.

గట్టిగ వానపడ్తే సిరిసిల్ల మునుగుతున్నది

రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఏది గెలిచినా ఆరు నెలలకే ఉప ఎన్నికలు వస్తాయని సంజయ్ అన్నారు. ‘‘కేటీఆర్​ను సీఎం చేస్తే సంతోష్ లొల్లిపెడ్తడు. సీఎం కుర్చీకోసం గొడవలు జరుగుతయ్. కాంగ్రెస్ అధికారంలో వచ్చినా అదే పరిస్థితి” అని సంజయ్ అన్నారు. గట్టిగ వానపడితే సిరిసిల్ల మునిగిపోతున్నదని, దీన్ని బట్టే కేటీఆర్ ఎలా డెవలప్ చేశారో అర్థం అవుతున్నదని మండిపడ్డారు. సిరిసిల్లలో రాణిరుద్రమ గెలుపు ఖాయమన్నారు.