రాముడిని నమ్మేవాళ్లు బీజేపీకి ఓట్లేస్తరు: బండి సంజయ్

రాముడిని నమ్మేవాళ్లు బీజేపీకి ఓట్లేస్తరు: బండి సంజయ్
  • బీఆర్ఎస్ కు  ఒక్క ఎంపీ సీటు కూడా రాదు
  •  ఎట్టి పరిస్థితిలోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు
  • కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్
  •  కేసీఆర్ అవినీతిపై జనం మాట్లాడుకుంటున్రు
  • రాముడిని నమ్మేటోళ్లు బీజేపీకి ఓట్లేస్తరు
  • బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: వచ్చే పార్లమెంటు  ఎన్నికల్లో బీజేపీకి రాముడు, మోదీ ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు.  కాంగ్రెస్ కు  రజాకార్లు, మజ్లిస్ పార్టీ ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రాముడిని నమ్మేటోళ్లు బీజేపీకి ఓటు వేస్తారని, నమ్మని వాళ్లు వేయరని అన్నారు.  కాళేశ్వరం నిర్మాణంలో తప్పు, అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఒప్పుకున్నదని, అందుకే కృష్ణా జలాల నినాదం ఎత్తుకున్నదని విమర్శించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు. కేసీఆర్ మొత్తం ఖర్చు పెట్టుకుంటానని చెప్పినా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. కేసీఆర్, కేటీఆర్ ఈపాటికే జైల్లో ఉండేవారన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు మాతో టచ్ లో ఉన్నరు

ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఉన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని అన్నారు. ప్రజలు కేసీఆర్  ను లైట్ తీసుకుంటున్నారని, ఆయన పనైపోయిందని అన్నారు. ఆయన అవినీతిపైనే ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కష్టమేనన్నారు.  బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తుంది కానీ కేసులు పెట్టదని అన్నారు.  ఎన్నికల కోడ్ పేరుతో 6 గ్యారంటీలను కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.