
- బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్లను పెంచే కుట్ర: బండి సంజయ్
- 30% ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ కుతంత్రాలు
- బీసీలకే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే మద్దతిస్తం
- కేటీఆర్‌పై సీఎం రమేశ్ చెప్పింది నిజమే
- చర్చకు వస్తే నిరూపిస్తానని కేటీఆర్‌కు సవాల్
- రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని కామెంట్
- కుటుంబ వారసత్వ రాజకీయాలకు, అవినీతి పార్టీలకు బీజేపీ దూరం అని వెల్లడి
కరీంనగర్, వెలుగు: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని చూస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. ముస్లిం డిక్లరేషన్ అనే విష వృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కేంద్ర నిధులతో నిర్మించిన ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడు అదనంగా బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. ఆ ముసుగులో 10 శాతం జనాభా ఉన్న ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే తెలంగాణలో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. అట్లాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే’’ అని పేర్కొన్నారు.
బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించేదాకా ఆ బిల్లును అడ్డుకొని తీరుతామని చెప్పారు. ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకు అమలు చేస్తేనే సంపూర్ణ మద్దతిచ్చి.. బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. కల్వకుంట్ల కవితపై కేసులు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తామంటూ సీఎం రమేశ్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన ముమ్మాటికీ వాస్తవమేనని అన్నారు. ‘‘నేనే వేదిక ఏర్పాటు చేసి సీఎం రమేశ్‌ను తీసుకొస్తా. డేట్, టైం ఫిక్స్ చెయ్. దమ్ముంటే చర్చకు రా. ఎవరిది తప్పో తేలుద్దాం’’ అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ప్రతి ఏటా బోనాల పండుగను నిర్వహించుకునే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ అన్నారు. ‘‘హిందువులంటే అంత చులకనా? తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలి. నేనడుగుతున్నా.. వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను, మసీదులను కూల్చే దమ్ముందా?త్వరలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ నియోజకవర్గంలో 30 శాతం ఓట్లున్న ఒక వర్గం వారిని సంతృప్తి పరిచేందుకు పెద్దమ్మ గుడిని కూల్చినట్లు అర్థమవుతున్నది” అని అన్నారు.
బీసీ సంఘాలకు సిగ్గు లేదా?
బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంటే ఏం చేస్తున్నారని బీసీ సంఘాల నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘బీసీ రిజర్వేషన్లకు వంతపాడుతున్న బీసీ సంఘాల నేతలకు సిగ్గు లేదా? ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసి.. హిందువులను మైనారిటీలుగా చేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతున్నది. ఈ విషయంలో మా లైన్ క్లియర్‌గా ఉంది. మేం మొదటి నుంచి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నాం. తక్షణమే ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి. లేకుంటే కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్పి తీరుతాం” అని అన్నారు. ‘‘50 శాతం రిజర్వేషన్ల గేట్లను బద్దలు కొట్టడం ద్వారా హిందుత్వాన్ని దెబ్బకొడతామంటూ మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పత్రికల్లో చూసిన. హిందువులంటే ఎంత ద్వేషమో ఆయన మాటల్లోనే అర్థమైతుంది. రాహుల్తల్లి క్రిస్టియన్. తాత ముస్లింల నుంచి వేరుపడ్డ పార్శీ. ఇగ రాహుల్‌ది ఏ మతమో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ దేశం మీద, హైందవ సంస్కృతి మీద అంతలా విషాన్ని గక్కుతున్నడు. కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేస్తున్న ఈ దేశ ప్రజల మీద రాహుల్‌కు రోజురోజుకూ ద్వేషం పెరుగుతున్నది.
అందుకే ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు ఇచ్చి దేశంలో హిందువులనే మైనారిటీలుగా మార్చే మహా కుట్రకు తెరదీసిండు” అని వ్యాఖ్యానించారు. ‘‘మోదీ కన్వర్టెడ్ బీసీ అంటున్న కాంగ్రెస్ నేతలారా.. రాహుల్ గాంధీ ఏ జాతి వ్యక్తి? ఏ మతం, ఏ కులం వ్యక్తి?’’ అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్‌ను నడిపే సత్తా ఆ పార్టీ నేతలకు లేదని, ఆ పార్టీ పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్పని అయిపోయిందని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్‌కు మొదట కేసీఆర్ టికెట్ నిరాకరిస్తే.. కేసీఆర్‌ను సీఎం రమేశ్ ఒప్పించి.. ఫండ్స్ ఇచ్చారని, అప్పుడు కేసీఆర్ టికెట్ ఇస్తే కేటీఆర్ అక్కడ గెలిచారని అన్నారు. అవినీతి సొమ్ముతో కేటీఆర్‌కు అహం ఎక్కువైందని, అందుకే సీఎం స్థాయిని గౌరవించకుండా ‘హౌలా.. వాడో దొంగా’ అని దుర్భాషలాడుతున్నాడని మండిపడ్డారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు, అవినీతి పార్టీలకు బీజేపీ దూరం అని పేర్కొన్నారు.