కేసీఆర్​ది మాటల ప్రభుత్వమే.. నెలైనా పైసా ఇవ్వలేదు : సంజయ్

కేసీఆర్​ది మాటల ప్రభుత్వమే.. నెలైనా పైసా ఇవ్వలేదు : సంజయ్

రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు ఏడుస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. పరిహారం ప్రకటించి నెలయినా పైసా ఇవ్వలేదని, ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ది మాటల ప్రభుత్వమే తప్ప, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంజయ్ పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను పరిశీలించారు. ‘‘సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు ఎకరాకు రూ.30 వేలో, 40 వేలో పరిహారం అందజేసే ఫైలుపై కేసీఆర్ సంతకం చేస్తారని భావించాను. కానీ అలాంటిదేం జరగలేదు. పంటనష్ట పరిహారం ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం ఎందుకు చేయలేదు” అని సంజయ్ ప్రశ్నించారు. 


‘‘సిరిసిల్ల జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో దాదాపు సగం పంటలు దెబ్బతిన్నాయి. కానీ ఆఫీసర్లు మాత్రం ఫీల్డ్​కు వెళ్లకుండా కేవలం 17 వేల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని లెక్కలు రాశారు” అని సంజయ్​ మండిపడ్డారు. ‘‘మార్చిలో కురిసిన వానలకు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు వచ్చి 2.8 లక్షల ఎకరాల్లోనే పంట దెబ్బతిన్నదని చెప్పారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ పైసా ఇవ్వలేదు” అని ఫైర్ అయ్యారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ కింద కేంద్రం రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు ఇచ్చిందని, అవేం చేశారో చెప్పాలన్నారు. వడ్ల కొనుగోళ్లు సకాలంలో ప్రారంభించి ఉంటే 30% పంట నష్టం తగ్గేదని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో రైతులను దగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

కేటీఆర్.. మీరిచ్చిన హామీల సంగతేంది?

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయని మంత్రి కేటీఆర్​కు కర్నాటక ఎన్నికల సంగతి ఎందుకో చెప్పాలని సంజయ్​ ప్రశ్నించారు.‘‘మీ తండ్రి కేసీఆర్​ తెలంగాణలో  సంపాదించిన సొమ్మునంతా కర్నాటకలో పంచుతున్నది నిజం కాదా? బీజేపీని ఓడించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ డబ్బులిస్తామన్నది నిజం కాదా?’’ అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రులకు నిత్యం కేంద్రంపై పడి ఏడ్వడం తప్ప వేరే పని లేదన్నారు. ‘‘కర్నాటకలో ఎన్నికలు జరిగితే మహారాష్ట్రకు పోయి ప్రచారం చేస్తున్న కేసీఆర్. మహారాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్” అని విమర్శించారు. 

జేపీఎస్ లకు మద్దతు

తమను రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంజయ్ మద్దతు తెలిపారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో జేపీఎస్ ల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి నుంచే సీఎం కేసీఆర్ కు బహిరంగ లెటర్ రాశారు. జేపీఎస్ లవి న్యాయమైన డిమాండ్లు అని, వాళ్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మూడేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ ను నాలుగేండ్లకు పెంచినా జేపీఎస్ లు భరిస్తూ డ్యూటీ చేశారు. ఇప్పుడు నాలుగేండ్లు పూర్తయినా రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణం. సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వం మెడలు వంచుతాం” అని హెచ్చరించారు.

మిడ్ మానేరు నిర్వాసితులను కేసీఆర్ మోసం చేసిండు..  

మిడ్ మానేరు నిర్వాసితులకు రూ.5 లక్షల చొప్పున ఇస్తానని 8 ఏండ్ల కింద కేసీఆర్​ హామీ ఇచ్చి అమలు చేయలేదని సంజయ్​ మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గంలోని చీర్లవంచ, రుద్రవరం గ్రామాల్లో పర్యటించిన సంజయ్.. మిడ్ మానేరు నిర్వాసితులతో మాట్లాడారు. ‘‘17 ఏండ్లయినా మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు. కేసీఆర్ అత్తగారి ఊరిలోనూ నిర్వాసితులు ఉన్నారు. అత్తగారి ఊరికే న్యాయం చేయని కేసీఆర్.. రాష్ట్రానికి ఏం చేస్తరు?” అని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. ఇటీవల జైలుకు వెళ్లొచ్చిన ఏబీవీపీ నాయకుడు మారవేణి రంజిత్​ను సంజయ్ పరామర్శించారు. చేనేత కళాకారుడు వెల్దండి హరిప్రసాద్ ఇంటికెళ్లి ఆయన నేసిన జీ20 లోగోను పరిశీలించి అభినందించారు.