బీఆర్ఎస్​కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే : బండి సంజయ్

బీఆర్ఎస్​కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసి నదిలో వేసినట్టేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకుంటే పార్లమెంట్ లో తెలంగాణవాదం లేనట్టే అని కేటీఆర్ అనడం సరికాద ని సంజయ్ మండిపడ్డారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీ సులో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ కు ఓటేస్తే పార్లమెంల్​లో తెలంగాణ పక్షాన పోరాడుతా మని కేటీఆర్ చెప్తున్నరు.

తెలంగాణ అనే పదాన్ని పార్టీ నుంచి తొలగించిన వ్యక్తులు మీరు. తెలంగాణ గురించి కొట్లాడేది మీరా? అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన్రు. అలాంటి మీరు.. తెలంగాణ గురించి పార్లమెంట్ లో ప్రశ్నిస్తారా? బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాన్ని గాలికొదిలేసి మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు తిరిగి డబ్బులు పంచిన్రు. రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది”అని కేటీఆర్​ను ఉద్దేశిస్తూ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా.. కేంద్రంలో మోదీ ప్రభుత్వమే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నట్టు తెలిపారు. అది జరగాలంటే తెలంగాణ నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. 

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైంది?

కాళేశ్వరం ప్రాజెక్ట్​పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని రేవంత్​ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయమై కిషన్ రెడ్డి నిలదీస్తే.. గొర్రెల మందలా ఎందుకు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో విచారణ సులువు కాదని, కోర్టుల్లో ఇప్పటికే వేల కేసులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం విషయంలో ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడి లేదని నిలదీశారు. నయీం ఎన్​కౌంటర్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. లారీల కొద్ది స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల డాక్యుమెంట్లు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని నిలదీశారు. నయీం ఆస్తులు ఎవరి పేర్ల మీద ట్రాన్స్​ఫర్ అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవోను సవరించి వెంటనే ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఈ ఆర్డర్స్ రిలీజ్ చేసేందుకు పైసా ఖర్చు ఉండదని తెలిపారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు ఉన్న ఉద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. 317 జీవో సవరించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు చాలా ఇబ్బందిపడుతున్నారని వివరించారు. ఈటల రాజేందర్​తో తనకు ఎలాంటి విభేదాల్లేవన్నారు. ఇద్దరం కలిసి పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నామని చెప్పారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనేది కేవలం దుష్ర్పచారం అని బండి సంజయ్ విమర్శిం చారు. నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని అన్నారు. అప్పుల నుంచి రాష్ట్రాన్ని ఎట్ల గట్టెక్కిస్తారో ప్రజలకు రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరిపై రూ.1.60 లక్షల అప్పు చేసిందని మండిపడ్డారు. నెల రోజులు అవుతున్నా.. ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం కాంగ్రెస్​తో చేత కాదని విమర్శించా రు. లోక్​సభ ఎన్నికల వరకు టైమ్​పాస్ చేయా లని చూస్తున్నదన్నారు. డ్రగ్స్ కేసుల సంగ తేంటని ప్రశ్నించారు. డ్రగ్స్ సప్లై చేస్తున్నదెవ రు.. వారి వెనుకాల ఉన్న బడా లీడర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ఇంటర్ స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్న గ్లోబరీనా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పురోగతి ఏంటో కూడా 30లక్షల మంది నిరుద్యోగులకు చెప్పాలని డిమాండ్ చేశారు.