Team India: ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు జూన్ 2026లో భారత పర్యటనకు రాబోతుంది. ఈ విషయాన్ని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధ్రువీకరించింది. ఇందులో భాగంగా ఒక టెస్ట్, మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు న్యూ చంఢీగడ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇదే ఈ మైదానంలో జరగనున్న తొలి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ కానుంది. జూన్ 14, 17, 20వ తేదీల్లో వన్డే మ్యాచులు కొనసాగనున్నాయి.
ఆఫ్ఘానిస్తాన్ జట్టుకు కొత్త కోచ్:
ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ఇప్పటి వరకు కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాయి. ఆ మ్యాచ్ 2018లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లో ఈ రెండు దేశాల క్రికెట్ టీమ్స్ ముఖాముఖి పోటీ పడలేదు. అలాగే భారత్‌తో ఆఫ్ఘానిస్తాన్ చివరిసారి జనవరి 2024లో మూడు టీ20ల సిరీస్‌లో తలపడింది. కాగా ఇప్పుడు మళ్లీ రెండు జట్ల మధ్య మొదటి పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సిరీస్ జరగనుండటం విశేషం. ఇటీవల ఆఫ్ఘానిస్తాన్ అన్ని ఫార్మాట్‌లకు ప్రధాన కోచ్‌గా రిచర్డ్ పైబస్ ను నియమించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా పని చేసిన ప్యాబస్, ప్రస్తుత కోచ్ జొనాథన్ ట్రాట్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నాడు. వచ్చే నెల యూఏఈలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ముందు ఆయన జట్టుతో కలుస్తారు.
షెడ్యూల్:
* టెస్ట్ మ్యాచ్: జూన్ 6 నుంచి 10 వరకు - న్యూ చండీగఢ్
* మొదటి వన్డే మ్యాచ్: జూన్ 14: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (HPCA), ధర్మశాల
* రెండో వన్డే: జూన్ 17: భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి (BRSABV) ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
* మూడో వన్డే: జూన్ 20: MA చిదంబరం స్టేడియం, చెన్నై
జూన్ లోనే మైదానంలోకి కోహ్లీ – రోహిత్:
ఈ వన్డే సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ భారత జట్టు జెర్సీలో కనిపించనున్నారు. వీరు ఇద్దరూ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయి ప్రస్తుతం కేవలం వన్డే (50 ఓవర్ల) ఫార్మాట్‌కే పరిమితమయ్యారు.
►ALSO READ | చరిత్ర సృష్టించిన జమ్మూకాశ్మీర్: 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి విజేత!
ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధం:
ఆఫ్ఘానిస్తాన్ సిరీస్ అనంతరం కోహ్లీ, రోహిత్‌లు ఇంగ్లండ్ తో జరిగే వైట్‌బాల్ పర్యటనలో పాల్గొంటారు. జూలై 1వ తేదీ నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. వన్డే మ్యాచ్‌లు జూలై 14 నుంచి స్టార్ట్ కానున్నాయి.
