దేశ ఇంధన రంగంలో ఏప్రిల్ 1, 2026 నుంచి ఒక సరికొత్త మార్పు రాబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ 'E20' ఇంధనం మాత్రమే విక్రయించాలనే నిబంధన అమలులోకి రానుంది. అయితే దీనివల్ల మైలేజీ తగ్గుతుందా, పాత వాహనాలకు ఇబ్బంది కలుగుతుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏమిటీ E20 ఇంధనం?
సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి తయారు చేసే ఇంధనాన్ని 'E20' అంటారు. దీనితో పాటు ఈ ఇంధనానికి కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ ఉండాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి తయారయ్యే రెన్యూవబుల్ ఇంధనం. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ దిగుమతులపై మనం ఆధారపడటం తగ్గుతుంది. గడిచిన పదేళ్లలో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల భారత్ సుమారు రూ.లక్షా 40వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది.
వాహనాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
చాలా మంది వాహనదారులకు ఉన్న అనుమానం.. ఈ కొత్త పెట్రోల్ వల్ల ఇంజన్ పాడవుతాయా అని. అయితే 2023 తర్వాత తయారైన వాహనాలన్నీ E20 ఇంధనానికి అనుగుణంగానే రూపొందించబడ్డాయి. అధిక ఆక్టేన్ విలువ(RON 95) ఉండటం వల్ల ఇంజన్ పనితీరు మెరుగుపడటమే కాకుండా, వాహనం నడుపుతున్నప్పుడు 'నాకింగ్' సమస్య తగ్గుతుంది. పాత వాహనాల విషయంలో మైలేజీలో 3 నుంచి 7 శాతం వరకు స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు. కానీ పర్యావరణ పరంగా చూస్తే.. కార్బన్ ఉద్గారాలు దాదాపు 30 శాతం వరకు తగ్గుతాయి.
►ALSO READ | స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. ఆ స్టాక్స్ లాభాల్లోకి..
ఈ విధానం వల్ల దేశంలోని రైతులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఇథనాల్ తయారీకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మరోవైపు ఆయిల్ కంపెనీలు ఇప్పటికే తమ సరఫరా వ్యవస్థను E20కి అనుగుణంగా మార్చుకున్నాయి. ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనతో భారత్ ఇంధన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకోబోతోంది. ఇది కేవలం పర్యావరణ హితమే కాదు, భారత రైతుల సంపదను పెంచే మార్గం కూడా అని నిపుణులు చెబుతున్నారు.
