- ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను రప్పిస్తామనడం హాస్యాస్పదం
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేదాకా పోరాటం
- రామచంద్రరావు ‘దీక్ష’కు సంఘీభావం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ఓవైపు ఫీజు బకాయిలు అందక రాష్ట్రంలోని కాలేజీలే మూతపడుతుంటే.. సీఎం మాత్రం ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను రప్పిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన ‘దీక్ష’కు ఆయన సంఘీభావం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచేదాకా పోరాటం కొనసాగిస్తామని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ సాక్షిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖకు అక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించి.. ఇప్పుడు మాట తప్పడం సిగ్గుచేటు’ అని సంజయ్ ఫైర్అయ్యారు.
గత ఐదేండ్లుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో దాదాపు రూ.15 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నత చదువులు చదువుతున్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వీరిలో ఎక్కువ మంది దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని చెప్పారు. ఫీజు బకాయిలు రాక కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాయని తెలిపారు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భరించలేక అప్పుల పాలవుతున్నాయని చెప్పారు. బకాయిలు రాక.. చేసిన అప్పులు తీర్చలేక ఇప్పటికే అనేక కాలేజీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
