మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అవుట్

మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అవుట్

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అవుట్ కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడును జల్లెడ పట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికపై ఆయన ఇవాళ పార్టీ నేతలతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, స్టీరింగ్ కమిటీ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ దమ్మేంటో చూపించి.. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎన్నికలయ్యే వరకు మునుగోడులో మకాం వేయాలని నేతలకు సూచించారు. ఎన్నికల ఫలితాల తర్వాతే దసరా, దివాళీ ఉత్సవాలు చేసుకుందామన్నారు. ఈ నెల 15 నుంచి చేపట్టాల్సిన ఐదో విడత పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

సర్వేలన్నీ బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నాయని మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడు ప్రజలంతా కేసీఆర్ పై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.