- కరీంనగర్లో ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు పట్టించుకోలే: బండి సంజయ్
- ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కలు చేశారని కామెంట్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ గెలుపు స్ఫూర్తితో హైదరాబాద్ పై బాజాప్తా కాషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు జీహెచ్ఎంసీని రేవంత్‌రెడ్డి మూడు ముక్కలు చేశారని ఆరోపించారు. ఒక ముక్క ఒవైసీకి రాసిచ్చారని, అదే రేవంత్ రెడ్డిపాలిట మరణ శాసనం కాబోతున్నదన్నారు.
శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్కక్కై ఎన్నో కుట్రలు చేశాయి. ఓటుకు రూ.7 వేలు ఇచ్చాయి. చివరకు బీజేపీ అభ్యర్థులను, నాయకులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాయి. వారి పాచిక పారలేదు.
సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన బడేబాయ్ ఒవైసీ బ్రదర్స్‌ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదు. తెలంగాణలో తొలిసారి కార్పొరేషన్‌పై కాషాయజెండా ఎగరేసి రికార్డు సృష్టించాం” అని పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లపై కూడా కాషాయ జెండా ఎగరేయబోతున్నామని, ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నామని అన్నారు.
వారికి ఈ తీర్పు చెంపపెట్టు..
‘‘బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడతారు. అభివృద్ధి గురించి మాట్లాడరు. కరీంనగర్‌కు నయాపైసా కూడా తేలేదు” అంటూ పిచ్చి కూతలు కూసిన వాళ్లకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని బండి సంజయ్ తెలిపారు. ఆదుకునేది, అభివృద్ధి చేసేది మోదీ ప్రభుత్వమేనని నమ్మి కరీంనగర్ ప్రజలు ఆదరించారన్నారు. ‘‘5 ఏండ్లలో కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేతల్లో చూపిస్తాం.
కరీంనగర్ అభివృద్ధికి మోదీ సర్కారు రూ.1500 కోట్లు ఖర్చు చేసింది. కరీంనగర్ ప్రజలు బీజేపీనే నమ్మారు. మోదీపై విశ్వాసంతోనే బీజేపీని గెలిపించారు. ఇప్పుడు 30 సీట్లు గెలిచినం. కొన్ని కారణాలవల్ల మరో ముగ్గురికి సీట్లు ఇవ్వలేకపోయినా.. వారు కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు వస్తున్నారు.
ఇదంతా ప్రజల ఆశీర్వాదం” అని తెలిపారు. కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు. తాను మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్నానని, ఆ తల్లి ఆశీర్వాదం ఈ గెలుపునకు ప్రధాన కారణమని తెలిపారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కేంద్ర నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు.
