ఇది కూల్చివేతల ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్

ఇది కూల్చివేతల ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • రేవంత్ తీరు మారకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తరు: కేంద్ర మంత్రి బండి సంజయ్
  •     మున్సిపల్ ఎన్నికలైపోగానే రైతు భరోసా ఎందుకు వేయలేదు
  •     కాళేశ్వరంపై విచారణ చేసే దమ్ము కాంగ్రెస్​కు లేదంటూ లేఖ రాయాలని డిమాండ్​
  •     అప్పుడు కేంద్రమే చూసుకుంటుందని వెల్లడి

కరీంనగర్, వెలుగు: నానా కష్టాలుపడి అప్పోసప్పో చేసి పేదలు ఇళ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని, ఇది కూల్చివేతల ప్రభుత్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ దేశంలోని పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతున్నదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని హెచ్చరించారు. 

కరీంనగర్ లోని 51వ డివిజన్ లో రూ.16 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తక్షణమే పేదల ఇండ్ల కూల్చివేతలను ఆపాలని, లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. 

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో రేవంత్ రెడ్డే ప్రకటించారని,  ఇట్లాంటి హామీలు చాలా ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయరని,  నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేస్తారని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకపోయినా, డీఏలు, ఫీజు రీయింబర్స్​మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో జనం కాంగ్రెస్​కు ఓట్లేశారని, దీంతో వాళ్లలో అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. 

మూడు రైతు భరోసా వాయిదాలు కలిపి బడ్జెట్ లో రూ.27 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాము వాస్తవాలు మాట్లాడితే కేంద్రం ఏమిచ్చిందంటూ ఎదురుదాడి చేయడం సీఎం, మంత్రులకు అలవాటైందన్నారు. కాంగ్రెస్, మజ్లిస్  రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయని ఆరోపించారు. 

ఇప్పడు ఒకరికి ఒకరు పడనట్లు డ్రామాలాడుతున్నారని, ఇద్దరికి ఎక్కడ చెడిందో వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు గత ఎన్నికల్లో మాట్లాడారని, తాము కూడా అదే చెప్పామన్నారు. ఈ అంశంపై విచారణ జరిపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే తాము విచారణ చేపట్టేందుకు సిద్ధమని, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎంను కోరారు.