నిరసనలు తెలిపిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..?

నిరసనలు తెలిపిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..?

వరంగల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించడాన్ని పెరుమాండ్ల గూడెం గ్రామానికి చెందిన మురళి, నిరంజన్, శ్రీనివాస్ అనే వ్యక్తులు ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపారని, అయితే.. వారి ఇంటికి అర్ధరాత్రి వేళ పోలీసులు వెళ్లి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అమాయక రైతులపై అమానుష చర్యలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఇళ్లల్లోకి అక్రమంగా వెళ్లి కిడ్నాప్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ రాక్షసానందం పొందిన సీఐ విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఐ భరత్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సదరు పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సీసీ టీవీ పుటేజీని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులను వదిలి పెట్టకూడదని, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. 

అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషమని బండి సంజయ్ అన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో తీయడం, ఆ వీడియోను టీఆర్ఎస్ నేతలకు చూపిస్తూ రాక్షసానందం పొందడం అత్యంత హేయనీయమైన చర్య అన్నారు. సీఐ బాధితులకు ఫోన్ చేసి ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. బాధితులపై రౌడీషీట్ ఓపెన్ చేసి, జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపిన రైతులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

వంద రోజుల యుద్ధం..ఎన్నో బతుకులు శిథిలం

రాహుల్ కు ఈడీ మరోసారి సమన్లు