లోక్​సభ స్పీకర్​, గవర్నర్​కు సంజయ్​ లేఖ

లోక్​సభ స్పీకర్​, గవర్నర్​కు సంజయ్​ లేఖ
  • బండి సంజయ్​కు 14 రోజుల రిమాండ్​ విధించిన కరీంనగర్ కోర్టు
  • రాష్ట్ర సర్కారు తీరుపై బీజేపీ హైకమాండ్​ సీరియస్​
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న నడ్డా

కరీంనగర్, వెలుగు: బీజేపీ స్టేట్​ చీఫ్​, ఎంపీ బండి సంజయ్​కి కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కరీంనగర్​ జైలుకు తరలించారు. సంజయ్​ అరెస్టుపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర సర్కారు తీరును తప్పుబట్టింది. అరెస్టులు, జైళ్లకు భయపడబోమని తేల్చిచెప్పింది. సంజయ్ అరెస్టును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో పార్టీ సీనియర్ నేతలు బయటకు రాకుండా తెల్లవారుజాము నుంచే పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేసి, ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించారంటూ పోలీసు కస్టడీ నుంచే లోక్ సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్ తదితరులకు బండి సంజయ్ లెటర్ రాశారు. సంజయ్ రిమాండ్‌లో ఉండే 14 రోజులు నిరసనలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది.
కొవిడ్ రూల్స్​ ఉల్లంఘించారని, తమ డ్యూటీకి ఆటంకం కలిగించారని బండి సంజయ్​పై కరీంనగర్​ టూ టౌన్  పోలీస్​స్టేషన్​లో  పోలీసులు కేసులు పెట్టారు. బెయిల్  రాకుండా ఉండేందుకు ఇంకా కొన్ని  పాత కేసులను యాడ్ చేసి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు రిమాండ్​ విధించింది. ఉద్యోగ, టీచర్ల బదిలీల కోసం ప్రభుత్వం తెచ్చిన 317 జీవోను సవరించాలని డిమాండ్​ చేస్తూ ఆదివారం రాత్రి కరీంనగర్​లోని ఎంపీ ఆఫీసులో సంజయ్​ జాగరణ దీక్షకు దిగగా.. ఆఫీసు తలుపులు పగులగొట్టి, గ్రిల్స్​  ఊడగొట్టి పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మానకొండూరు పీఎస్​ నుంచి..!
ఆదివారం రాత్రి సంజయ్​ను అరెస్టు చేసి మానకొండూరు పోలీస్​ స్టేషన్​కు తరలించగా.. అక్కడే ఆయన దీక్షకు కూర్చున్నారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి మొత్తం మానకొండూరు పీఎస్​లో ఉన్న సంజయ్​ను సోమవారం ఉదయం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) తెచ్చారు. అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరుపరిచేందుకు కావాల్సిన పేపర్ వర్క్ పూర్తి చేసుకొని.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. కాగా, మానకొండూరు పీఎస్​ నుంచి పీటీసీకి సంజయ్​ని తరలిస్తున్నారని తెలుసుకొని అక్కడికి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవి సహా పలువురు నేతల వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పీటీసీ వద్దకు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి వచ్చారు. 
పాత కేసులు కలిపి..!
బండి సంజయ్ మీద రిమాండ్ కేస్ డైరీలో ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన కేసులు మాత్రమే కాకుండా పాత  కేసులను కూడా పోలీసులు యాడ్​ చేశారు. గతంలో కరీంనగర్, సిరిసిల్ల, బోయిన్​పల్లి, మల్యాల పోలీస్ స్టేషన్లలో ఆయనపై నమోదైన కేసులను తాజాగా కోర్టు ముందు ఉంచారు. 143, 188, 341, 332, 333 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్ ని  ఏ -1 గా పెట్టారు. 
ఈయనతో పాటు మరో 15  మంది బీజేపీ నేతల మీద కేసులు ఫైల్​ చేశారు. ఇందులో సోమవారం బండి సంజయ్​, పెద్దపల్లి జితేందర్, కచ్చు రవి, మర్రి సతీశ్​, పుప్పాల రఘును కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించారని నమోదు చేసిన కేసులపై బీజేపీ లీగల్ సెల్ అడ్వొకేట్లు అభ్యంతరం తెలిపారు. విచారణ చేపట్టిన జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్.. సంజయ్​ పెట్టుకున్న బెయిల్​ పిటిషన్​ను తిరస్కరించి, ఆయనతోపాటు మిగతా నలుగురికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగనుంది. మొత్తం ఐదుగురిని పోలీసులు కరీంనగర్​ జిల్లా జైలుకు తరలించారు. 
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
బండి  సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. 
క్యాండిల్‌‌ ర్యాలీలో పాల్గొననున్న నడ్డా
సంజయ్ అరెస్ట్‌‌ను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం బీజేపీ తలపెట్టనున్న క్యాండిల్ ర్యాలీ లో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న బాబు జగ్జీవన్‌‌రాం విగ్రహం నుంచి లిబర్టీలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరగనుంది.
నేడు కరీంనగర్‌‌‌‌కు కిషన్‌‌రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి మంగళవారం కరీంనగర్‌‌‌‌కు వెళ్లనున్నారు. అక్కడి బండి సంజయ్ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. కరీంనగర్ జైల్లో సంజయ్‌‌తో ములాఖాత్ కానున్నారు.