IND vs BAN: అభిషేక్ ఒక్కడిదే విధ్వంసం.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా ఒక మాదిరి టార్గెట్

IND vs BAN: అభిషేక్ ఒక్కడిదే విధ్వంసం.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా ఒక మాదిరి టార్గెట్

ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పవర్ ప్లే లో ఓపెనర్ల దూకుడుతో 200 ఖాయమనుకుంటే బంగ్లా బౌలర్లు పుంజుకొని టీమిండియాకు భారీ స్కోర్ ఇవ్వకుండా చేశారు. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75: 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చివర్లో కొన్ని మెరుపులతో హార్దిక్ పాండ్య (38) ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు.. తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి మూడు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే వచ్చాయి. నాలుగో ఓవర్ నుంచి అసలు విధ్వంసం స్టార్ట్ అయింది. ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ విధ్వంసంతో నాలుగో ఓవర్లో 21.. ఐదో ఓవర్లో 17.. ఆరో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే లో ఇండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రిషద్ హుస్సేన్ విడగొట్టాడు. 

గిల్ వికెట్ తీసి బంగ్లాకు తొలి వికెట్ అందించాడు. ఇక్కడ నుంచి ఇండియా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. మూడో నెంబరు లో ప్రమోషన్ తో వచ్చిన దూబే 2 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత సూర్యతో సమన్వయ లోపం కారణంగా బౌండరీలతో హోరెత్తిస్తున్న అభిషేక్ శర్మ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే సూర్య (5) పెవిలియన్ కు చేరాడు. భారీ షాట్ కు ప్రయత్నించి తిలక్ వర్మ (5) కూడా ఔటవ్వడంతో ఇండియా 129 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లలో అక్షర్ పటేల్ తో కలిసి హార్దిక్ పాండ్య జట్టుకు ఒక మాదిరి స్కోర్ ను అందించాడు.