మళ్లీ మునిగిన బంజారా కాలనీ.. హయత్‎నగర్‎లో బోట్లు తిరుగుతున్న పరిస్థితి

మళ్లీ మునిగిన బంజారా కాలనీ.. హయత్‎నగర్‎లో బోట్లు తిరుగుతున్న పరిస్థితి

ఎల్బీనగర్, వెలుగు: ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సిటీ శివారు హయత్ నగర్‎లోని బంజారాకాలనీ మరోసారి నీట మునిగింది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాలనీలోకి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. ఇండ్లలోకి వరద చేరడంతో వృద్ధులు, చంటిబిడ్డలు, దివ్యాంగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సామాన్లు, నిత్యావసరాలు తడిసిపోయాయి.

సోమవారం కొందరు నడవలేని స్థితిలో ఉన్న తమ పేరెంట్స్‎ను వీపున వేసుకొని నీళ్లలోంచి బయటకు తీసుకొచ్చారు. వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులు, చిన్న పిల్లలను ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి బాధితులను పరామర్శించి సహాయక చర్యలు చేపట్టారు.

సామ తిరుమల రెడ్డి వరద బాధితులను ఆదుకోవాలని నీళ్లలో ఉండి నిరసన తెలిపారు. ఆ తర్వాత ఫుడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. అంతవరకు ప్రశాంతంగా ఉన్న కాలనీలోకి రాత్రి ఒంటి గంట సమయంలో వరద వచ్చి చేరిందన్నారు. చిన్న చిన్న పిల్లలతో తాము ఎంతో ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఆదివారం రాత్రి, సోమవారం రోజంతా తాము అనుభవించిన పరిస్థితులు చెప్పడానికి కూడా నోటమాట రావడం లేదని కన్నీరుమున్నీరయ్యారు.