ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పర్యటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానికుల ఫిర్యాదు మేరకు మొదట తాజ్ బంజారా లేక్‌ను పరిశీలించారు. చెరువులోకి నేరుగా మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్డు నిర్మించడం, వ్యర్థాలను పారబోయడంతో ఈ పరిస్థితికి వచ్చిందని తెలుసుకున్నారు.
బంజారాలేక్ పై భాగంలో ప్రభుత్వ భూమి ఉందని, దాన్ని కాపాడడంతో పాటు చెరువు పునరుద్ధరణకు రిపోర్ట్తయారు చేస్తామన్నారు. ఇండ్ల జోలికి పోకుండా చెరువును పరిరక్షిస్తామన్నారు. నాలాలను మూసివేసి వరద ముప్పునకు కారణమయ్యే నిర్మాణాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తర్వాత శంషాబాద్ మండలం మామిడిపల్లి పరిసరాల్లో నాలుగైదు చెరువులు మాయమయ్యాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఒంగోని కుంట, కనకయ్యకుంట, మర్రివానికుంట, ఎర్రకుంటలో కొన్నింటిని పూర్తిగా ఆక్రమించడాన్ని సీరియస్‌గా పరిగణించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి చెరువులు, వరద కాలువల పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు. ఆక్రమణదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కబ్జాలను తొలగించాలని సూచిస్తామని, లేకపోతే హైడ్రా నేరుగా రంగంలోకి దిగుతుందన్నారు.
