
- ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు
- కరోనాతో బార్లకు రాని జనం
- నష్టాలను తగ్గించుకునేందుకు స్పెషల్ ఆఫర్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా వల్ల బార్లకు జనం రాకపోవడంతో మేనేజ్మెంట్లు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాయి. బిజినెస్ దెబ్బతినడంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు ధరలు తగ్గిస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా బార్లలో ఎమ్మార్పీకే మద్యం అమ్ముతున్నారు. కొన్నిచోట్ల కొన్ని బ్రాండ్లపై 2+1 ఆఫర్లు ఇస్తున్నారు. రెండు పెగ్గులు కొంటే, ఒక్కటి ఫ్రీ పోస్తున్నారు. కరోనాతో పోయినేడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు బార్లు మూతపడ్డాయి. వైన్స్ కు ముందే పర్మిషన్ ఇచ్చిన సర్కార్.. బార్లకు మాత్రం ఆలస్యంగా అక్టోబర్ లో అనుమతి ఇచ్చింది. బార్లు ఓపెన్ అయినంక, మొదట గిరాకీనే లేదు. ఆ తర్వాత కాస్త పెరిగినా పెద్దగా బిజినెస్ లేదు. కరోనా సోకుతుందనే భయంతో జనం బార్లకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తలు రావడం, సర్కార్ లిక్కర్‌పై 20 శాతానికి పైగా రేట్లు పెంచడంతో జనం పెద్దగా బార్లకు వెళ్లడం లేదు. ఎక్కువ మంది వైన్స్ లలోనే మందు కొంటున్నారు.
బిజినెస్ డల్..
వివిధ కారణాలతో బార్ల బిజినెస్ డల్ అయింది. కరోనా వల్ల ఏడు నెలలు మూతపడడంతో, ఓనర్లు తీవ్రంగా నష్టపోయారు. ఆ టైమ్ లో బార్లు నడవకున్నా కిరాయి, కరెంట్ బిల్లులు భరించాల్సి వచ్చింది. బార్లు ఓపెన్ చేసినంక కూడా జనం పెద్దగా రావడం లేదని, దీంతో ఖర్చులన్నీ మీద పడుతున్నాయని ఓనర్లు వాపోతున్నారు. బార్ల పక్కనే వైన్స్‌లు ఉండడం, అక్కడ పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడంతో బిజినెస్ పుంజుకోవడం లేదంటున్నారు.
ఆఫర్లతో అట్రాక్ట్..
బిజినెస్ పెంచుకునేందుకు బార్ల ఓనర్లు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. జనాన్ని ఆకట్టుకునేందుకు స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సాధారణంగా వైన్స్‌లో కంటే బార్లలో రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో ఫుల్ బాటిల్‌పై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుంటారు. ఒక పెగ్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు ఎక్కువగా ఉంటుంది. బీరుపై రూ.10 నుంచి రూ.20 ఎక్స్‌ట్రా తీసుకుంటారు. కానీ గిరాకీ లేకపోవడంతో ప్రస్తుతం ఎమ్మార్పీకే అమ్ముతున్నారు. కొన్ని బార్లలో 2+1 ఆఫర్లు ఇస్తున్నారు.
ఎమ్మార్పీకే అమ్ముతున్నం
కరోనా భయంతో బార్లకు ఎవరూ రావడం లేదు. మరోవైపు బార్ల దగ్గర్నే వైన్స్ ఉండడం, అక్కడ పర్మిట్ రూమ్‌లు కూడా ఉండడంతో మా బిజినెస్ దెబ్బతింటోంది. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇక తప్పని పరిస్థితుల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్ముతున్నాం. ఇట్ల చేయడం ద్వారా కనీసం నష్టాలు రాకుండా చూసుకునే చాన్స్ ఉంది.
– తిరుపతి, బార్ ఓనర్, రామగుండం