బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య..కేసు నమోదు చేసిన పోలీసులు

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య..కేసు నమోదు చేసిన పోలీసులు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన చల్ల సంపత్ (19) బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌‌‌‌లో సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం సంపత్ తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వర్సిటీ అధికారులు, సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థి ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా.. లేక చదువు ఒత్తిడా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో క్యాంపస్‌‌‌‌లోని తోటి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.