బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత కేసీఆర్‌దే

బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత కేసీఆర్‌దే
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బేగంపేట్ డివిజన్ పాటిగడ్డలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవిస్తూ ప్రతి పండుగను గొప్పగా జరుపుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 
 బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని, మహిళలు పండుగ రోజున కొత్త బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతోందని మంత్రి తలసాని తెలిపారు. బతుకమ్మ చీరల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గత పాలకులు  బతుకమ్మ పండుగను నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ పల్లె నుంచి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రసిద్ధిగాంచింది అని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక కార్పొరేటర్  మహేశ్వరి పాల్గొన్నారు.