V6 News

డీలిమిటేషన్ లాగానే..బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడండి : జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

డీలిమిటేషన్ లాగానే..బీసీలకు 42%  రిజర్వేషన్ల కోసం పోరాడండి : జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     ఢిల్లీలో సీఎం రేవంత్​తో జాజుల నేతృత్వంలో బీసీ సంఘాల భేటీ
  •     జనగణనలో బీసీ కులగణన జరిగేలా ప్రధానితో చర్చించాలని విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు: డీలిమిటేషన్ పై ఇండియా కూటమిని ఒక్కటి చేసి పార్లమెంటులో ఏ విధంగా పోరాడారో.. బీసీ డిమాండ్లపై కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బీసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. శనివారం ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని సీఎం నివాసంలో జాజుల నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు సీఎంతో సమావేశం అయ్యారు. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగనన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ నేతలు సీఎంను కోరారు. 

2026 జనాభా లెక్కలు పూర్తికాకుండానే.. 131వ రాజ్యాంగ సవరణ పేరుతో మహిళ రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ చేయాలన్న కేంద్ర ఆలోచనను అడ్డుకోవడం శుభపరిణామం అన్నారు. ఇదే స్పూర్తితో.. సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేసేలా, తెలంగాణలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదించే విధంగా, దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించే విధంగా కేంద్రంతో పోరాడాలన్నారు. ఈ విషయంలో మొత్తం బీసీ సమాజం కాంగ్రెస్ వెంట నడుస్తుందని సీఎంకు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతాం

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని పార్లమెంటులో రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడారని, తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా కులగణన జరిగేలా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతామని సీఎం హామీ ఇచ్చినట్లు జాజుల తెలిపారు.