ప్రైవేటు బిల్లులతో మోసం చేస్తే సహించం

ప్రైవేటు బిల్లులతో మోసం చేస్తే సహించం
  • బీసీ సంఘాల హెచ్చరిక

బషీర్​బాగ్​,వెలుగు : ప్రైవేటు బిల్లుల పేరుతో బీసీలను మోసం చేసే ప్రయత్నాలను సహించబోమని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం , బీసీ పొలిటికల్ ఫ్రంట్ లీడర్లు హెచ్చరించారు. బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో బైరు శేఖర్ గంగపుత్ర అధ్యక్షతన చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తమిళనాడు తరహాలో రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌‌‌‌లో చేర్చాలని, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తేవాలని, జాతీయ జనగణనలో కులగణన నిర్వహించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ బీసీల హక్కులు, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీల అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు సంబంధించి తీర్మానాలు చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్ట విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బత్తిని కీర్తి లత, దామోదర్, నాగభూషణం జంగం, ఎర్రమాద వెంకన్న నేత, చెన్నై శ్రీకాంత్, లింగేష్ యాదవ్, కర్నాటి మనోహర్, రాపోలు జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.