- సరిచేయాలని త్వరలో ప్రభుత్వానికి బీసీ కమిషన్ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన రిపోర్ట్ లో గంగపుత్ర, బెస్త గూండ్ల కులాలకు సంక్షిప్త నామంగా అగ్నికుల క్షత్రియ పేరుతో ప్రస్తావించారని ఆయా కులాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తమ అభ్యంతరాలను బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. సరిచేయాలని త్వరలో ప్రభుత్వానికి లేఖ రాస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్ లోని కార్యాలయంలో బీసీ కమిషన్ సమావేశం జరిగింది. చైర్మన్ నిరంజన్, మెంబర్లు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి, మెంబర్ సెక్రటరీ బాలమాయదేవి హాజరయ్యారు.
కులగణన రిపోర్ట్ తో, స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను అధ్యయనం చేసి తమ పరిశీలనను ప్రభుత్వానికి అందచేస్తామని చైర్మన్ వెల్లడించారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లు, వార్డు మెంబర్ల వివరాలను తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 130 వెనుకబడిన తరగతుల కులాల నమోదు కోసం సెన్సస్ వారు తీసుకుంటున్న చర్యలను వివరించాలని తెలంగాణ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్‌కు లేఖ రాయాలని కమిషన్ నిర్ణయించింది.

