గురుకుల ఎంట్రెన్స్ స్టేట్ ఫస్ట్ విద్యార్థికి న్యాయం చేయండి : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

గురుకుల ఎంట్రెన్స్  స్టేట్ ఫస్ట్ విద్యార్థికి న్యాయం చేయండి : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
  • సీఎం రేవంత్ రెడ్డికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ

హైదరాబాద్, వెలుగు: గురుకుల ఎంట్రెన్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన ఓ స్టూడెంట్ కు సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్లికేషన్ ఫామ్ లో క్యాస్ట్ పేరును తప్పుగా ఎంట్రీ చేయటంతో మంచి ప్రతిభ ఉన్నా అతనికి సీటు రాలేదు. ఈ నేపథ్యంలో  సదరు విద్యార్థికి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం లెటర్ రాశారు. వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, శాఖాపూర్‌‌‌‌‌‌‌‌లోని ప్రగతి స్కూల్ కు చెందిన భాను ప్రకాశ్.. గురుకుల అడ్మిషన్‌‌‌‌‌‌‌‌కు జరిగే ఎంట్రెన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ లో తన కులాన్ని బీసీ 'ఏ'గా పేర్కొన్నాడు. 

మరొక దగ్గర ఎంబీసీ  వర్తిస్తుందా అనే దానికి పొరపాటున ఎస్ అని రాశాడు. దానివల్ల స్టేట్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్ వచ్చినా ఆ విద్యార్థికి  సీటు దొరకలేదని సీఎంకు బీసీ కమిషన్ చైర్మన్ తన లేఖ ద్వారా వివరించారు. ప్రగతి స్కూల్ హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్రకారం.. ఆ స్కూల్ నుంచి మొత్తం 85 మంది విద్యార్థులు 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు అటెండ్ అయ్యారన్నారు. అందులో 54 మంది విద్యార్థులకు 1000 లోపు ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అందులో భాను ప్రకాశ్ అనే విద్యార్థికి రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిందని చైర్మన్ వెల్లడించారు. ఈ విద్యార్థికి సీటు దొరికేలా న్యాయం చేయాలని సీఎంను నిరంజన్ తన లేఖ ద్వారా రిక్వెస్ట్ చేశారు.