కులగణన ఎందుకు చేయట్లే?.. ప్రధాని పర్యటనపై గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల నిరసన

కులగణన ఎందుకు చేయట్లే?.. ప్రధాని పర్యటనపై గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల నిరసన
  •     కులగణన చేయకపోతే ప్రధాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: జనగణనలో సమగ్ర కులగణన ఎందుకు చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని ఆల్ పార్టీ నేతలు ప్రశ్నించారు. కులగణన చేపడతామని ప్రకటించి, ఆ హామీని విస్మరించినందుకు నిరసనగా ఆదివారం రాష్ర్టవ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు ప్రదర్శనలు చేశారు. ఇందులో భాగంగా గన్ పార్క్  అమరవీరుల స్తూపం ముందు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో షాద్ నగర్  ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, నెల్లికంటి సత్యం, మధుసూదనచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్  చైర్మన్  మెట్టు సాయిలు పాల్గొన్నారు. జాజుల మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా బీసీ సమాజం ‘ప్రధానికి పది ప్రశ్నలు’ పేరుతో అడిగితే ఇంత వరకు సమాధానం లేదన్నారు.. బీసీలను మోసంచేస్తూ పోతే భవిష్యత్తులో ప్రధాని ఇంటిని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు.

కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్  మాట్లాడుతూ.. బీసీ ప్రధానిగా మోదీ ఉన్నందుకు బీసీలు సిగ్గుపడుతున్నారని అన్నారు. తెలంగాణలో జరిగినట్లు కులగణనను మోడల్ గా తీసుకొని కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్  చేశారు. మాజీ స్పీకర్  సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్  గౌడ్, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తక్షణమే కులగణనపై కేంద్రం స్పందించి బీసీలకు న్యాయం చేయాలన్నారు.