- బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్బాగ్,వెలుగు : బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు చేయనున్నట్లు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం కాచిగూడలో జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారితో కలిసి బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్చేశారు. లేకపోతే తెలంగాణలో బీజేపీ రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతుందని హెచ్చరించారు.
బీసీ ఉద్యమంలో భాగంగా 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్ , 18న ఎంపీలతో ములాఖత్ , 23న అఖిలపక్ష సమావేశం, డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ దిగ్బంధం చేస్తామన్నారు. అలాగే, డిసెంబర్ మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీల బస్సు యాత్ర, జనవరి చివరి వారంలో వేల వృత్తులు–కోట్ల గొంతులు నినాదంతో హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీసీ సంఘాల నాయకులు ఎం.వీరస్వామి, బి.మణిమంజరి సాగర్, ఎం.చంద్రశేఖర్ గౌడ్, నందగోపాల్, కౌలే జగన్నాథం, జిల్లాల నరసింహ, శివకుమార్, మాదేశి రాజేందర్, గొడుగు మల్లికార్జున్, కొమ్ము శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
