పార్టీ పరంగా రిజర్వేషన్లు ఒప్పుకోం : జాజుల

పార్టీ పరంగా రిజర్వేషన్లు ఒప్పుకోం : జాజుల
  • చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లు కావాలి: జాజుల
  • బీసీలను మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని వార్నింగ్​ 

హైదరాబాద్/బషీర్​బాగ్, వెలుగు: పార్టీ పరంగా రిజర్వేషన్లను ఒప్పుకోబోమని, చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ముందుకెళ్తే, రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. 

బీసీ జేఏసీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్’పేరుతో 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో బీసీలు పెద్ద ఎత్తున రన్ నిర్వహించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌‌‌‌లో బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ కూడలిలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు రన్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం కార్యాచరణ నిర్ణయించుకొని డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే పార్లమెంట్ సమావేశాలను లక్ష్యంగా చేసుకొని పోరాడాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలిసి ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను పెంచకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీలను మోసం చేయడమే అవుతుందన్నారు. 

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి వీడి పార్లమెంట్‌‌‌‌లో బిల్లును ఆమోదించాలని, లేదంటే పార్లమెంట్‌‌‌‌ను ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి.హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చీఫ్‌‌‌‌ కోఆర్డినేటర్ గజ్జ కృష్ణ, కో ఆర్డినేటర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌‌‌‌ చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.