జనరల్ సీట్లలో అవకాశం ఇవ్వాలి..బీసీ సంఘాల నేతల డిమాండ్

జనరల్ సీట్లలో అవకాశం ఇవ్వాలి..బీసీ సంఘాల నేతల డిమాండ్
  • పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వ్యాఖ్య 
  • త్వరలో సీఎం, పీసీసీ చీఫ్​ను కలవాలని నిర్ణయం
  • బీజేపీ, బీఆర్​ఎస్ నేతలను సైతం కలిసేందుకు ప్రయత్నాలు
  • బీసీ సంఘాలను, జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగినందున.. జనరల్ సీట్లలో తమకు అవకాశం ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలవాలని నిర్ణయించారు. అదే విధంగా రిజర్వేషన్లలో జరిగిన అన్యాయంపై బీసీ సంఘాలను, జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరుతున్నారు.

రిజర్వేషన్లు భారీగా తగ్గడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తీవ్ర అగ్రహంగా ఉన్నట్టు నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సర్దిచెప్పి,  జనరల్ సీట్లలో బీసీలకు అవకాశం ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని కోరుతున్నారు. 

అదే విధంగా ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల పదవుల్లో బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని హామీ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా 2019 లో కంటే ఇపుడు బీసీలకు చాలా తక్కువ సీట్లు దక్కాయని బీసీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలు ఉంటే.. 42 శాతం అంటే కనీసం 5,300 గ్రామ పంచాయతీలు బీసీలకు దక్కాల్సి ఉండగా.. ఇప్పుడు 2,500 మాత్రమే దక్కాయని సీఎం, పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. గత ఎన్నికల్లో 23 శాతం రిజర్వేషన్లు దక్కితే ఇపుడు 16 నుంచి 19 శాతం మాత్రమే దక్కాయని వాళ్లకు చెప్పనున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్​కూ విజ్ఞప్తి..

జనరల్ సీట్లలో బీసీలకు అవకాశం ఇవ్వాలన్న అంశాన్ని అధికార కాంగ్రెస్ తో పాటు  బీజేపీ, బీఆర్ ఎస్ అధ్యక్షులను సైతం బీసీ సంఘాల జేఏసీ నేతలు కలిసి కోరనున్నారు. త్వరలో బీజేపీ స్టేట్​ప్రెసిడెంట్ రాంచందర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, తొలి దశ ఎన్నికలకు గురువారం నుంచే నామినేషన్లు స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఈ వారంలోనే ఈ మూడు పార్టీల నేతలను కలవనున్నట్టు బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్  ప్రస్తావన..

ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టారు. ఇందులో బీసీలు 56 శాతం ఉన్నట్టు తేలింది. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ కు పంపారు. 

గవర్నర్ ఈ బిల్లును రాష్ట్రపతికి పంపడంతో ఆగిపోయింది. తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రిజర్వేషన్ల సాధనకు ధర్నా చేపట్టినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరో వైపు గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులు ఆగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోంది.