బంద్కు అందరూ సహకరించాలి.. పిలుపునిచ్చిన బీసీ సంఘాల లీడర్లు

బంద్కు అందరూ సహకరించాలి.. పిలుపునిచ్చిన బీసీ సంఘాల లీడర్లు
  • మద్దతు ప్రకటించిన కుల సంఘాలు

ముషీరాబాద్, వెలుగు:ఈ నెల 18న బీసీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు అన్ని విద్యాసంస్థలతో పాటు స్టూడెంట్స్​ తల్లిదండ్రులు కూడా సహకరించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ కోరారు. బుధవారం విద్యానగర్ లోని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బంద్​ను సక్సెస్​ చేసి బీసీల సత్తా చూపించాలని పిలుపునిచ్చారు.

సేవాలాల్ సేన మద్దతు..

ముషీరాబాద్: బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ స్పష్టం తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేని కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ ఇవ్వడంలో ఎందుకని ప్రశ్నించారు. 

బీసీల ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్మించాలని  పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు కోనేటి నరిసింహా, ఎస్సీ, ఎస్టీ కమిషన్​ మాజీ మెంబర్, ఎల్​హెచ్​పీఎస్​ అధ్యక్షుడు రాంపాల్ నాయక్, ప్రొఫెసర్ అశోక్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్  పాల్గొన్నారు.

బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..

బషీర్​బాగ్: శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి, 9వ షెడ్యూల్​లో చేర్చాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, జాతీయ ఓబీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మాట్లాడారు. 

రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 23న రాజ్ భవన్ ముట్టడి, 25న ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, 26న ఉస్మానియా వర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు.

షెడ్యూల్​ 9లో చేర్చాల్సిందే..

ఓయూ: బీసీ విద్యార్థి జేఏసీ నాయకుడు సైదులు ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ న్యూ సెమినార్ హాల్​లో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ప్రొఫెసర్​ కొండా నాగేశ్వరరావు, ప్రొఫెసర్​ రామ్ షెపర్డ్, జంపాలా రాజేశ్​ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా ఏర్పడి బీసీ రిజర్వేషన్​ సాధనకు ఉద్యమించాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాల్సిందేనన్నారు. ఈ నెల 18న జరిగే బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలిగొండ నరసింహా, అశోక్ కుమార్, నామ సైదులు, రాంబాబు పాల్గొన్నారు.