- బీసీ రిజర్వేషన్ల సాధన సమితి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని '42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి' డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నేతలు గురువారం సెక్రటేరియెట్‌లో వినతిపత్రం సమర్పించారు. అనంతరం సెక్రటేరియెట్ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సమితి తరఫున రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ఇప్పటికే 30 జిల్లాల్లో రిజర్వేషన్ల ఉపయోగాలపై సమావేశాలు నిర్వహించినట్లు నేతలు తెలిపారు. కేంద్రంలో అమలులో ఉన్న బీసీ నాన్-క్రీమీ లేయర్ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసి, బీసీలలోని పేదలకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు.
బీసీలలోని వర్గాల మధ్య సమాన న్యాయం కోసం 42% రిజర్వేషన్లలో ఉప-వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నామినేటెడ్ పోస్టులు, కమిషన్లు, బోర్డులు, న్యాయ సలహా మండళ్లలో 90 శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు కె.వి గౌడ్, చెన్నై శ్రీకాంత్, అవ్వారు వేణు, సింగం నాగేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
