
- స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందేలా చూడాలి
- బీసీ గురుకుల అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
- నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాలను తనిఖీ చేస్తూ ఉండాలని, స్టూడెంట్లను పర్యవేక్షించాలని బీసీ గురుకుల అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న ఘటనలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఘటనలు జరగినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 327 బీసీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఆర్సీఓలు, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ తో పాటు ఇతర అధికారులతో మంత్రి పొన్నం జూమ్ లో సమావేశం నిర్వహించారు.
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని, వంటచేసే పరిసరాలు, డైనింగ్ హాల్ క్లీన్ గా ఉండేలా చూడాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని మంత్రి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి స్కూల్లో తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని, అందులో విద్యార్థులు, టీచర్లు, ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉండాలన్నారు. ఈ కమిటీ సభ్యులు ఆహారాన్ని రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని సూచించారు.
‘‘నైట్ డ్యూటీ చేసే టీచర్లు స్కూల్లో విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాలి. భోజనం తయారు చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమలు రాకుండా అన్ని హాస్టల్స్ కి నెట్ ఏర్పాటు చేయాలి. అకడమిక్ క్యాలెండర్ ను కచ్చితంగా పాటిస్తూ పదో తరగతి, ఇంటర్ లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేయాలి” అని మంత్రి పొన్నం ఆదేశించారు.
స్టూడెంట్ల భద్రతపై ఫోకస్
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యల ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెసిడెన్షియల్ గురుకులాల అధికారులతో శుక్రవారం సెక్రటేరియెట్ లో సీఎస్ రామకృష్ణారావు సమావేశమయ్యారు. ఈ అంశాలపై సెక్రటరీలకు సీఎస్ పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సెక్రటరీలు సైదులు, అలుగు వర్షిణి, సీతాలక్ష్మి మూడు గురుకులాల అధికారులతో సమావేశమయ్యారు.
అన్ని గురుకులాల విద్యార్థుల భద్రత కోసం కొత్తగా హాస్టల్ భద్రతా సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సెక్రటరీలు ఆదేశించారు. స్టూడెంట్ల సమస్యలు తెలుసుకుంటూ సైకాలజిస్టులతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు.