దానం, కడియం పార్టీ మారినట్టు ఆధారాల్లేవ్..అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్

దానం, కడియం పార్టీ మారినట్టు ఆధారాల్లేవ్..అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్
  • ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్ 
  • వారిద్దరు పార్టీ మారినట్లు పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేదు
  • వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నం 
  • మీడియాలో, పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్‌‌‌‌ల ఆధారంగా పార్టీ మారినట్లు గుర్తించలేమని వెల్లడి
  • స్పీకర్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్​చిట్‌‌‌‌
  • తీర్పును స్వాగతిస్తున్నా: దానం
  • గొప్ప తీర్పు ఇచ్చారు : కడియం

హైదరాబాద్, వెలుగు:   ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌‌‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. బుధవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వారి అనర్హత పిటిషన్లపై తీర్పును వెల్లడించారు. దానం, కడియంలపై దాఖలైన అనర్హత పిటిషన్లకు కొట్టివేస్తున్నట్లు పిటిషనర్లు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్ల సమక్షంలో స్పీకర్ ప్రకటించారు. ఈ ఇద్దరు పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలను పిటిషనర్లు చూపించలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. 

దానం, కడియం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారు ఇంకా బీఆర్ఎస్‌‌‌‌లోనే కొనసాగుతున్నట్లు గుర్తిస్తున్నామని, ఇప్పటికీ ప్రతి నెలా ఈ ఇద్దరి జీతం నుంచి బీఆర్ఎస్‌‌‌‌ఎల్పీకి రూ.5 వేలు వెళ్తున్నాయన్నారు.  అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా కేటీఆర్ చెప్పారని.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని దానం, కడియం బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నట్లు తన విచారణలో గుర్తించినట్టు స్పీకర్ పేర్కొన్నారు. కేవలం మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పులు, పత్రికల్లో వచ్చిన పేపర్ కటింగ్‌ల ఆధారంగా ఈ ఇద్దరు పార్టీ మారినట్లు గుర్తించలేమన్నారు. దానం, కడియం బీఆర్ఎస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరినట్లు పిటిషనర్లు బలమైన ఆధారాలను సమర్పించలేకపోయారని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు కాపీని స్పీకర్ చదివి వినిపించారు. దీంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. బుధవారం దానం, కడియంకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. అంతకుముందు విడతల వారీగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావ్, సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపులపై 2025 జులై 31న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 29న అనర్హత పిటిషన్లపై విడతల వారీగా విచారణ ప్రారంభించిన స్పీకర్.. అదే పద్ధతిలో తీర్పులు కూడా జారీ చేశారు. 

బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదు: దానం

స్పీకర్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు దానం నాగేందర్‌‌ చెప్పారు. స్పీకర్ తీర్పు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తాను ఎప్పుడు పనిచేయలేదని, ఎంపీగా పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, ఏ ఇతర పార్టీ సభ్యత్వాన్ని తీసుకోలేదని స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బీఆర్ఎస్‌ఎల్పీ మీటింగ్‌కు తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయితీ ఉండేది కాదన్నారు. తన మీద పిటిషన్ వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. తనపై బీజేపీ ఎందుకు అనర్హత పిటిషన్ వేసిందని, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని దీంతో తేలిపోయిందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని ఇతర పార్టీల నుంచి తీసుకొని వారిని మంత్రులుగా చేసిన విషయాన్ని బీఆర్ఎస్ మర్చిపోయిందా అని ఆయన నిలదీశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. ఉప ఎన్నికకు వెళ్లి గెలిచేవాడినన్నారు. తాను యుద్ధ రంగం నుంచి వచ్చిన వాడినని, ఖైరతాబాద్ ప్రజల సైనికుడినని పేర్కొన్నారు.
 
పార్టీ ఫిరాయింపులకు సుత్రధారి కేసీఆర్: కడియం 

పార్టీ ఫిరాయింపులకు సుత్రాధారి కేసీఆర్ అని కడియం శ్రీహరి మండిపడ్డారు. స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నానని, అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని స్పీకర్ గొప్ప తీర్పు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ తనపై వేసిన అనర్హత పిటిషన్ చట్టబద్ధం కాదని పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్‌లోకి తీసుకొని మంత్రి పదవులిచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని, కేసీఆర్ ఆ తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెబితే.. రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని, అందుకే ఆయన ఈ విషయంపై మాట్లాడడం లేదన్నారు. తనపై బీఆర్‌‌ఎస్ న్యాయ పోరాటం చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. నైతిక విలువల గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ విప్ జారీ చేసింది లేదు, తాము ధిక్కరించ లేదని పేర్కొన్నారు.