- పాలసీల రూపకల్పనకు సెన్సెస్ డేటానే కీలకం
- రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జన గణన-2027 ప్రక్రియలో ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో చార్జ్ సెన్సస్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో జనాభా వివరాలు ఉన్నది ఉన్నట్లుగా ప్రతిబింబించాలని, నాణ్యమైన డేటా వల్లే మెరుగైన అభివృద్ధి ప్రణాళికలు, పాలసీల రూపకల్పన సాధ్యమవుతుందని తెలిపారు.
జనగణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ (హౌస్ లిస్టింగ్), గృహ గణన ఉంటాయని వివరించారు. మొదటి దశ సక్రమంగా జరిగితే రెండో దశలోని జనాభా గణన సజావుగా సాగుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. నగర పరిధిలో చేపట్టే ఈ సర్వేలో కుటుంబాల వాస్తవ స్థితిగతులు స్పష్టంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు చార్జ్ సెన్సస్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
