- ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు
- ఆయన, హరీశ్‌రావు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఫైర్
- తలసాని, సబితకు మంత్రి పదవులు ఇచ్చింది మరిచిపోయారా?: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు దానం, కడియం విషయంలో స్పీకర్ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ..స్పీకర్ ఏ విషయంలోనైనా తన పరిధిలో సరైన నిర్ణయమే తీసుకుంటారని తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు ఫిరాయింపులపై ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధంగా పలు రాష్ట్రాల్లో అధికారం చేపట్టిందని, ఆ పార్టీకి ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాకే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్ తన పరిధి మేరకు ఎమ్మెల్యేలు దానం, కడియం విషయంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్లు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుంటే అభివృద్ధి కోసం.. అదే పని తాము చేస్తే ప్రజాస్వామ్యంపై దాడి అవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బలవంతంగా బీఆర్‌ఎస్ లో చేర్చుకొని, తలసాని, సబితకు మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని మరిచిపోయారా అని నిలదీశారు. చివరకు మండలి చైర్మన్ పదవిని కూడా లాక్కున్నారని, ఇప్పుడేదో నీతిమంతుడిలా కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. బుధవారం ఇందిరా భవన్ లో రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. దీనికి మహేశ్ గౌడ్ హాజరై, మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకే కేటాయించామన్నారు. త్వరలోనే ఎస్టీ నాయకులకు మెజార్టీ డైరెక్టర్ పోస్టులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
