- ఫుడ్ డెలివరీ కంపెనీలకూ తంటాలే.. జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మనదేశ గ్యాస్ ఎకోసిస్టమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖతార్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో చాలా రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. జేఎం ఫైనాన్షియల్ తాజా రిపోర్టు ప్రకారం.. ఒప్పందాల ప్రకారం సరఫరా చేయలేక కొన్ని కంపెనీలు ఫోర్స్ మెజూర్ నోటీసులు జారీ చేశాయి. అంటే సప్లయ్ చేయలేమని చేతులెత్తేశాయి. పారిశ్రామిక వినియోగదారులకు సప్లయ్ 10–50 శాతం వరకు తగ్గింది. ఈ పరిస్థితుల వల్ల ఎక్కువగా ఇబ్బందిపడే రంగాలు, కంపెనీల గురించి తెలుసుకుందాం.
ఆయిల్, గ్యాస్
ధరలు పెరగడం వల్ల ఎల్ఎన్జీ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల గెయిల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, గుజరాత్ గ్యాస్ బిజినెస్, మార్జిన్లపై ప్రభావం పడుతుంది. పెట్రోనెట్ ఖతార్ ఎల్ఎన్జీ సరఫరాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్వంటి చమురు మార్కెటింగ్ సంస్థలపై మార్జిన్ల ఒత్తిడి పెరుగుతోంది.
క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు
గ్యాస్ కొరత వల్ల దేవయాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్, వెస్ట్‌లైఫ్ ఫుడ్ వరల్డ్, రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా వంటి సంస్థలపై ప్రభావం పడవచ్చు. సఫైర్ ఫుడ్స్ వంట అవసరాల్లో 63 శాతం ఎల్‌పీజీపైనే ఆధారపడి ఉంది. ఈ సంస్థ వద్ద వారానికి సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. అవసరమైతే కొన్ని రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే అవకాశం ఉంది. వెస్ట్‌లైఫ్ కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు దెబ్బతింటే ఎటర్నల్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారంపై ప్రభావం ఉంటుంది.
కెమికల్స్
మనదేశ ఎరువుల రంగానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అమ్మోనియా కీలకం. పారాదీప్ ఫాస్పేట్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు మిడిల్ఈస్ట్ దేశాల నుంచి అమ్మోనియాను తెచ్చుకుంటాయి. నౌకల మార్గాల్లో ఆటంకాల వల్ల ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే నైట్రిక్ యాసిడ్, సోడియం నైట్రేట్, అమ్మోనియా, మెథనాల్, ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాల ధరలు పెరిగాయని సంబంధిత కంపెనీలు చెబుతున్నాయి.
ఆటోమొబైల్స్
ఆటో తయారీ సంస్థల (ఓఈఎం) వద్ద ప్రస్తుతం 6 నుంచి 7 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రధాన సంస్థల్లో ఉత్పత్తి తగ్గితే ఆ ప్రభావం యాక్సెసరీలు, విడిభాగాల వంటివి తయారు చేసే కంపెనీలపైనా పడుతుంది. సరఫరా గొలుసులో తలెత్తే ఈ ఆటంకాలు వల్ల వెహికల్స్ డెలివరీ ఆలస్యం అవుతుంది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల వాహనాల తయారీ వ్యయం పెరిగి వినియోగదారులపై అదనపు భారం పడవచ్చు.
బిల్డింగ్ మెటీరియల్స్
కజారియా సిరామిక్స్, సోమానీ సిరామిక్స్, సెరా శానిటరీవేర్ వంటి కంపెనీలు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. సబర్మతి గ్యాస్ నుంచి సరఫరా 50 శాతం తగ్గిందని సోమానీ, సెరా ఎక్స్ఛేంజీలకు తెలిపాయి. గుజరాత్ గ్యాస్ కూడా 50 శాతం సరఫరా తగ్గించిందని మోర్బీ సిరామిక్స్ వెల్లడించింది. ఎల్ఎన్జీ, ప్రొపేన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్‌తో ఫ్యాక్టరీలు 10 నుంచి 15 రోజులు మాత్రమే పనిచేయగలవు.
ఇండస్ట్రియల్స్, పోర్ట్స్, లాజిస్టిక్స్
పీఎన్జీ, ప్రొపేన్ కొరత వల్ల ఏజిస్ లాజిస్టిక్స్‌కు లబ్ధి చేకూరవచ్చు. ఈ కంపెనీ అధిక మార్జిన్లతో ప్రొపేన్ విక్రయించే అవకాశం ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. ఇతర ఇంధన వనరుల లభ్యత తగ్గడంతో పారిశ్రామిక వినియోగదారులు ఏజిస్ అందించే ప్రొపేన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీ పంపిణీ విభాగం లాభదాయకత పెరిగి మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే వీలుంది.
కన్జూమర్ డ్యూరబుల్స్
ఏసీలు, టీవీల వంటి ఎలక్ట్రానిక్హోం అప్లయెన్సెస్ తయారు చేసే అంబర్ ఎంటర్‌ప్రైజెస్, బ్లూ స్టార్, హావెల్స్, ఈప్యాక్ డ్యూరబుల్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తదితర కంపెనీలపై ఒత్తిడి నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ నౌకల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయని పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తెలిపింది. అంబర్ ఎంటర్‌ప్రైజెస్ బ్రేజింగ్ కోసం ఎల్‌పీజీని వాడుతుంది. కొరత పరిష్కారం కాకపోతే ప్రొడక్షన్ నిలిచిపోవచ్చు. బ్లూ స్టార్ కూడా పరిస్థితిని అంచనా వేస్తోంది.
