IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాహుల్.. గైక్వాడ్‌, తిలక్ వర్మకు ఛాన్స్

IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాహుల్.. గైక్వాడ్‌, తిలక్ వర్మకు ఛాన్స్

సౌతాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు భారత జట్టు వచ్చేసింది. 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఆదివారం (నవంబర్ 23) ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుభమాన్ గిల్.. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా ఈ సిరీస్ కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించారు. సీనియర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలకు జట్టులో స్థానం దక్కింది. ఆస్ట్రేలియాతో ఇటీవలే జరిగిన వన్డే సిరీస్ కు జట్టుకు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు జట్టులో చోటు కల్పించారు.  

ఇటీవలే సౌతాఫ్రికా ఏ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రుతురాజ్ గైక్వాడ్ స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్  ఏడాది తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. పంత్ చివరిసారిగా  ఆగస్టు 2024లో ఇండియా తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ ఫాట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బిజీ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకొని వర్క్ లోడ్ మ్యానేజ్ మెంట్ కారణంగా రెస్ట్ ఇచ్చారు. అక్షర్ పటేల్ ను జట్టు నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతాయి. తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు జరుగుతాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది.   

డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9 న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. వన్డే మ్యాచ్ లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు.. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. 

సౌతాఫ్రికాతో మూడు వన్డేలకు భారత జట్టు:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్