స్వదేశంలో సౌతాఫ్రికాపై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గంభీర్ భారత కోచ్ గా జట్టులోకి రావడంతోనే పరాజయాలు ఎక్కువయ్యాయని తీవ్రంగా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గౌహతి వేదికగా బుధవారం (నవంబర్ 26) జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా టెస్ట్ భవిష్యత్ డైలమాలో పడింది. దీంతో గంభీర్ ను భారత జట్టు కోచ్ గా తొలగించాలనే డిమాండ్స్ వినిపించాయి.
గంభీర్ కూడా తన భవిష్యత్ ను బీసీసీఐ నిర్ణయిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన పదవీకాలంలో సాధించిన విజయాలనూ గుర్తు పెట్టుకోవాలన్నాడు. గంభీర్ కామెంట్స్ పై బీసీసీఐ స్పందించింది. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగించే ప్రతిపాదనను తోసిపుచ్చింది. జట్టు పరివర్తన దశలో ఉన్నందున బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్‌తో బోర్డు చర్చలు జరుపుతుందని గంభీర్ ను తొలగించే ఆలోచన లేదని బీసీసీఐ అధికారి అన్నారు.
బీసీసీఐ అధికారి మాట్లాడుతూ ఇలా అన్నారు.. "గంభీర్ విషయంలో బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోవడంలో తొందరపడదు. జట్టు పరివర్తన దశలో ఉంది. ప్రపంచ కప్ దగ్గర పడుతున్నందున ఇప్పుడు కోచ్ ను మార్చే ఉద్దేశ్యం లేదు. గంభీర్ తో ఒప్పందం 2027 ప్రపంచ కప్ వరకు ఉంది. ఆ తర్వాతే అతనిపై నిర్ణయం తీసుకుంటాం. సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్‌తో బీసీసీఐ మాట్లాడుతుంది". అని బీసీసీఐ అధికారి తెలిపారు.
సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ కామెంట్స్:
"నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. ఇండియా క్రికెట్ ముఖ్యం, నేను కాదని కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడే చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నా. ప్రజలు విజయాలను చాలా త్వరగా మర్చిపోతారు. ఎందుకంటే ఇంగ్లండ్‌లో యువ జట్టుతో ఫలితాలు సాధించిన వ్యక్తిని నేనేనన్న విషయం మర్చిపోయి కివీస్ చేతిలో వైట్‌వాష్‌ను గుర్తు పెట్టుకున్నారు. నేను చాంపియన్స్, ఆసియా ట్రోఫీని కూడా గెలిచిన వ్యక్తిని". అని గౌతీ గుర్తు చేశాడు.
టెస్టుల్లో గంభీర్ కు బ్యాడ్ రికార్డ్:
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు టెస్టుల్లో విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొట్టిన టెస్టుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఓటమి తర్వాత గంభీర్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు గంభీర్ కోచ్ గా భారత జట్టు ఆరు టెస్ట్ సిరీస్ లు ఆడింది. వీటిలో రెండు గెలిచి మూడు ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ సమమైంది. గెలిచిన రెండు సిరీస్ లు కూడా బలహీనమైన బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై కావడంతో గంభీర్ హెడ్ కోచ్ గా ఇప్పటివరకు విఫలమయ్యాడనే చెప్పాలి.
