- సీట్ల కేటాయింపులో ముందు వరుసలో అధికార పార్టీ
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 403 స్థానాలకు ఎలక్షన్స్
- బీసీలకు కాంగ్రెస్ 206, బీఆర్ఎస్ 201, బీజేపీ 177 స్థానాలు కేటాయింపు
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇచ్చి బీసీ నినాదాన్ని వినిపించాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 19 మున్సిపాలిటీల్లోని 403 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇందులో151 వార్డులను బీసీలకు రిజర్వ్ చేయగా, 225 వార్డులు జనరల్‌కు కేటాయించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీసీలకు సముచిత స్థానం కల్పించగా, బీజేపీ సైతం ప్రాధాన్యత ఇచ్చింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలు రచిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలోపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో అన్ రిజర్వ్ స్థానాల్లోనూ బీసీలకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాయి. సంగారెడ్డి జిల్లాలోని 11 బల్దియాల్లో 256 వార్డుల్లో అత్యధికంగా కాంగ్రెస్ 130, బీఆర్ఎస్ 117, బీజేపీ 102 స్థానాల్లో బీసీలకు అవకాశం ఇచ్చాయి. బీసీలకు 79 స్థానాలు, అన్ రిజర్వ్ డ్ కింద 55 స్థానాలు కేటాయించారు. వీటితో పాటు ప్రధాన పార్టీలు అన్ రిజర్వ్ స్థానాల్లో ఎక్కువగా బీసీలకు అవకాశం కల్పించాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, ఆందోల్-జోగిపేట, నారాయణఖేడ్, కోహిర్, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో దాదాపు సగం మంది బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో...
సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాయి. జిల్లాలో చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ మున్సిపాలిటీల పరిధిలో 72 వార్డులున్నాయి. వీటిలో 33 వార్డులను జనరల్‌కు కేటాయించగా, వీటిలో సైతం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వడం గమనార్హం. బీఆర్ఎస్ 43, కాంగ్రెస్ 42, బీజెపీ 39 మంది బీసీలకు టికెట్లు ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో అన్ రిజర్వ్ డ్ స్థానాల్లో సైతం బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇచ్చారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులు ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు 121 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి. బీఆర్ఎస్ అత్యధికంగా 51 మంది బీసీలకు టికెట్లు ఇవ్వగా, బీజేపీ 36 మందికి, కాంగ్రెస్ 34 మంది బీసీలకు టికెట్లు ఇచ్చాయి.
