- ఓటర్లకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సూచన
కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) పేరిట సర్వే జరగనుందని, దానిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశంలోని పెట్రోల్ రేట్లను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నియంత్రిస్తున్నారని అన్నారు. ఇంత జరగుతున్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ కు భయపడి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకపోతే లాభం చైనాకు పోతుందన్నారు. అమెరికాతో ట్రేడ్ ఒప్పందంతో ఎవరికి లాభమో చెప్పాలన్నారు.
దేశ వ్యవసాయ రంగం పరిస్థితి కూడా బాగాలేదని, అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల నష్టమే జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత బయటికి వచ్చిందని, ఇప్పుడు అన్న కేటీఆర్, ఆమె కొట్లాడుకుంటున్నారని ఒవైసీ అన్నారు. హరీశ్ రావు కూడా తన మామ కేసీఆర్ కు ధోకా ఇచ్చి బీజేపీలోకి వెళతాడన్నారు. బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కూడా అంతేనన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు.
