బీజేపీకి ఓటేసిందని ఇంట్లో వాళ్లే కొట్టిన్రు.. భోపాల్​లో ముస్లిం మహిళపై దాడి

బీజేపీకి ఓటేసిందని ఇంట్లో వాళ్లే కొట్టిన్రు.. భోపాల్​లో ముస్లిం మహిళపై దాడి
  • పిల్లలతో కలిసి మధ్యప్రదేశ్​ సీఎం 
  • శివరాజ్ సింగ్​ను కలిసిన మహిళ

భోపాల్​: వద్దన్నా వినకుండా బీజేపీకి ఓటేసిందని ముస్లిం మహిళపై ఆమె కుటుంబ సభ్యులే దాడి చేశారు. బీజేపీకి ఓటు ఎందుకు వేశావంటూ విచక్షణారహితంగా కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు.. తన పిల్లలను తీసుకుని నేరుగా సీఎం ఇంటికి వెళ్లింది. తనపై కుటుంబ సభ్యులు దాడి చేశారని, తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని సీఎం ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్​లోని భోపాల్​ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం శివరాజ్ సింగ్​ చౌహాన్ ఆమెకు ధైర్యం చెప్పారు. తల్లీబిడ్డలకు ఎలాంటి హాని కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..

భోపాల్​కు చెందిన సమీనాబీ బీజేపీ మద్దతుదారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటేసింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో పెద్ద దుమారమే రేగింది. సమీనాబీ మరిది ఆమెపై దాడి చేసి కొట్టాడు. గాయాలపాలైన సమీనాబీ తన పిల్లలను  తీసుకుని సీఎం చౌహాన్ ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న సీఎం.. ఆమెను లోపలికి పిలిచారు. పిల్లలను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. సమీనాబీ తప్పేమీ చేయలేదని చెప్పారు. తర్వాత బయటకు వచ్చిన సమీనాబీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చౌహాన్ తనకు ఎలాంటి కష్టం రానీయబోమని చెప్పారన్నారు. ఇకపైనా తాను బీజేపీకే ఓటేస్తానని తేల్చిచెప్పారు. తనకు నచ్చిన వారికి ఓటేసే హక్కును రాజ్యాంగం తనకు కల్పించిందని వివరించారు.