హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా.. అన్ని ప్రధాన సిగ్నల్స్ దగ్గర ఇదే సమస్య.. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి భిక్షాటన

హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా..  అన్ని ప్రధాన సిగ్నల్స్ దగ్గర ఇదే సమస్య..  ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి భిక్షాటన
  • బెగ్గర్స్ ఫ్రీ సిటీ పేరుతో గతేడాది జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్​
  • కొద్దిరోజుల నుంచి సైలెంట్
  • పట్టించుకోని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో బెగ్గింగ్​మాఫియా రెచ్చిపోతోంది. ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులను టార్గెట్​చేసుకుని పిల్లలు, మహిళలు, వృద్ధులతో భిక్షాటన చేయిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను, మహిళలను, అవయవ లోపం ఉన్నవారిని తీసుకువచ్చి అడుక్కునేలా ట్రైనింగ్​ఇచ్చి దండుకుంటోంది. రోజువారీ టార్గెట్లు పెట్టి మరీ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. కొంతకాలం కింది వరకు ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసిన ఈ ముఠాలు ఇప్పుడు నగరంలో పెద్దగా పట్టించుకునేవారు లేకపోవడంతో అడ్డాగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. 

పిల్లలైతే డబ్బులేస్తారని ..

అభం శుభం తెలియని పసి పిల్లలను చూపిస్తే ఎక్కువగా డబ్బులు వస్తాయని బెగ్గింగ్ మాఫియా వారినే ఎక్కువగా తీసుకువస్తోంది. ముఖ్యంగా రెండేండ్లలోపు చిన్నారులపైనే ఎక్కువగా ఫోకస్​పెట్టింది. ఎందుకంటే చిన్న పిల్లలు ఎత్తుకుని అడుక్కునే మహిళలకే ఎక్కువగా డబ్బులు వస్తుండడంతో అదే పద్ధతిని ఫాలో అవుతోంది.

రోజుకు రూ.300 నుంచి రూ.400

ఎక్కువగా సిటీకి వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు బెగ్గింగ్​మాఫియా వల వేస్తోంది. వారి పిల్లలను భిక్షాటన కోసం తీసుకుంటూ రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు వారి తల్లిదండ్రులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వారి ఒప్పందం ప్రకారం చిన్నారులను ఉదయం తీసుకువెళ్లి సాయంత్రం తిరిగి అప్పగిస్తారు. ఇలా నగరంలో సుమారు 500లకి  పైగానే చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఏడ్వకుండా మత్తు మందు..

సాధారణంగా చిన్న పిల్లలు తల్లుల దగ్గరే ఎక్కువగా ఉంటారు. అద్దెకు తీసుకున్న పిల్లలను కొత్త మహిళలకు ఇస్తుండడంతో ఏడుపు అందుకుంటున్నారు. అలాగే, ఆకలి అయినప్పుడు కూడా పెద్ద పెట్టున రోదిస్తారు. దీంతో దందా దెబ్బతింటుందని భావించిన బెట్టింగ్​మాఫియా పిల్లలని కూడా చూడకుండా రెండు మూడు గంటలకు ఒకసారి మత్తు మందు ఇస్తున్నట్టు సమాచారం. 

జలుబు, దగ్గు వచ్చినప్పుడు వాడే సిరప్​లు అధిక మోతాదులో ఇస్తున్నారు. నిద్రమాత్రలు, ట్రాంక్విలైజర్లను ఫుడ్​లేదా పాలలో కలిపి ఇస్తున్నారు. అలాగే, వైట్​నర్ లాంటి వాటిని కూడా వాసన చూపిస్తూ మత్తులోకి పంపిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  

లైట్​ తీసుకున్న జీహెచ్ఎంసీ 

గతేడాది బెగ్గర్స్ ఫ్రీ సిటీ లక్ష్యంగా జీహెచ్‌‌‌‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వందలాది మంది భిక్షాటన చేసేవారిని గుర్తించి షెల్టర్ హోమ్స్‌‌‌‌కు తరలించింది. దీంతో నగరంలో భిక్షాటన తగ్గినట్లు కనిపించింది. కార్పొరేషన్ల విభజన తర్వాత స్పెషల్​డ్రైవ్​అటకెక్కడంతో ఇతర నగరాల బెగ్గింగ్​మాఫియా ముఠాల కన్ను నగరంపై పడింది. 

ఒక్కొక్కరుగా వందల సంఖ్యలో సిటీకి చేరుకున్నట్టు సమాచారం. వీరంతా ప్రధానంగా సిగ్నల్స్​ను అడ్డాగా చేసుకుని దందా చేస్తున్నారు. ఇంకొందరు గుడులు, బస్టాప్​లు, రైల్వేస్టేషన్లు, పెద్ద పెద్ద హోటల్స్​దగ్గర మకాం వేశారు.  

విమెన్​ అండ్​ చైల్డ్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​ ఎక్కడ?

బెగ్గింగ్​ముఠాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలు, మహిళలతో పాటు వృద్ధులనే ఎక్కువగా తీసుకువస్తున్నారు. అయితే, అడుక్కునే చిన్న పిల్లల సంఖ్య ఎక్కువవుతున్నా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. నిజానికి చిన్న పిల్లలను రెస్క్యూ చేసి సంరక్షణ కేంద్రాలకు తరలించాల్సి ఉన్నా అటువంటి చర్యలు తీసుకోవడం లేదని సోషల్ యాక్టివిస్ట్ లు ఆరోపిస్తున్నారు.

బాల కార్మికులపైనే ముస్కాన్ ఫోకస్..

ఆపరేషన్ ముస్కాన్ ద్వారా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఈ ఏడాది జూలై నెలలో స్పెషల్​డ్రైవ్స్​నిర్వహించి 1,413 మంది చిన్నారులను కాపాడాయి. ఇందులో 563 మంది ఇతర రాష్ట్రాల వారు కాగా, 22 మంది నేపాల్ కు చెందిన వారున్నారు. అయితే, బాల కార్మికులపై, వీధులు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో ఉంటున్న వారిపైనే ఎక్కువగా ఫోకస్​పెట్టారని, భిక్షాటన చేస్తున్న వారి గురించి పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.   

కాల్​ చేసి చెప్పండి..

చిన్నారులు భిక్షాటన చేస్తూ ఎక్కడైనా కనిపిస్తే  చైల్డ్ హెల్ప్‌‌‌‌లైన్ టోల్​ఫ్రీ నంబర్​1098కు లేదా పోలీస్ కంట్రోల్ రూం 100కు, నేషనల్ ఎమర్జెన్సీ నంబర్ 112కు సమాచారం ఇవ్వొచ్చు. అలాగే, డిస్ట్రిక్ట్​చిల్డ్రన్​ప్రొటెక్షన్​యూనిట్, స్థానిక శిశు సంక్షేమ శాఖ ఆఫీస్​లేదా సమీప పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేయొచ్చు. చిన్నారి ఉన్న ప్రాంతం, టైం, భిక్షాటన చేయిస్తున్న వ్యక్తుల వివరాలు చెప్తే స్పందించి చిన్నారులను రక్షించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది