
- లేకుంటే 28న నిరసన చేపడతం
- పీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్
హైదరాబాద్, వెలుగు : కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఓపెన్ చేయించాలని పీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 28న గాంధీభవన్‌లో నిరసన చేపడతామని.. నెక్లెస్‌రోడ్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రమిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ను రాష్ట్రపతితో కాకుండా ప్రధానితో ప్రారంభించాలని నిర్ణయించడం దారుణమన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశానికి రాష్ట్రపతి మొదటి వ్యక్తి అని గుర్తుచేశారు.
రాష్ట్రపతి కాకుండా ప్రొటోకాల్‌లో నాలుగో స్థానంలో ఉన్న ప్రధాని మోడీ పార్లమెంటును ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రపతి మహిళ, గిరిజన వ్యక్తి కావడం వల్లే అవమానిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతితో పార్లమెంట్‌ను ప్రారంభింపజేసేలా అంబేద్కర్ సంఘాలు, దళిత, గిరిజన, ప్రజాస్వామిక సంఘాలు కలిసి రావాలని బెల్లయ్య కోరారు.