ర్యాపిడో డ్రైవర్ గా మారిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి

ర్యాపిడో డ్రైవర్ గా మారిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి

చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు తమ జీవితాన్ని ఒత్తిడితో కూడినదిగా భావిస్తారు. బిజీ బిజీ షెడ్యూల్ లో గడుపుతూ... ఇంటి నుంచి ఆఫీసుకి, ఆఫీసు నుంచి ఇంటికి తప్ప మరో ఊసేలేనట్టు గడుపుతుంటారు. అందుకే చాలా మంది ఉద్యోగులు తమ హాలిడేస్ టైంలో ట్రెక్కింగ్, క్యాంపింగ్, పార్టీలలో పాల్గొంటూ తమకి నచ్చినట్టు లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అదే తరహాలో ఓ కార్పొరేట్ ఉద్యోగి కూడా తనకిష్టమైన పనిని చేయడానికి పూనుకున్నాడు. 

ఇక వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన నిఖిల్‌ సేథ్ తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్‌ చేసుకున్నట్లు తెలిపాడు. మార్గం మధ్యలో ఆ ర్యాపిడో డ్రైవర్‌తో మాట కలిపినట్లు చెప్పాడు. అలా మాట్లాడుతూ తాను (ర్యాపిడో డ్రైవర్‌) మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అంత పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నా.. ర్యాపిడ్‌ ఎందుకు చేస్తున్నారు అని నిఖిల్‌ సేథ్ ప్రశ్నించగా... "నేను మనుషుల్ని ప్రేమిస్తాను.. వస్తువుల్ని వాడుకుంటాను సార్‌. నాకు మనుషులతో మాట్లాడడం అంటే మహా ఇష్టం. కానీ నేను మాట్లాడేందుకు నా చుట్టు పక్కల మనుషులెవరూ లేరు. అందుకే నేను అందరితో మాట్లాడేందుకు ఇలా వారాంతాల్లో ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నాన"ని చెప్పినట్టు నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగాయ.... నెటిజన్లు దీనిపై పలురకాలుగా స్పందిస్తున్నారు.