బీజేపీని ఓడించేందుకే సీపీఎంతో కలిశాం : రేవంత్‌‌‌‌ రెడ్డి

బీజేపీని ఓడించేందుకే సీపీఎంతో కలిశాం : రేవంత్‌‌‌‌ రెడ్డి
  • ఎంపీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తాం: రేవంత్‌‌‌‌ రెడ్డి 
  • సీపీఎం ముఖ్య నేతలతో సీఎం చర్చలు

హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు తాము సీపీఎంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఈ మేరకు పలు అంశాలపై ఆ పార్టీ రాష్ట్ర నేతలతో చర్చించామని చెప్పారు. ఏఐసీసీ సూచన మేరకు చర్చలు జరిగాయని తెలిపారు. శనివారం సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డితో ఆయన నివాసంలో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీ, పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించారు. 

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎం జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో కలిసి పని చేస్తోందని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య సహకారం ఉంటుందని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో సీపీఎం తమకు మద్దతు తెలుపుతుందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సహకారం అందించేందుకు ఆ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. భువనగిరి ఎంపీ సీటుతో పాటు ఇతర స్థానాల్లోనూ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరామన్నారు. ఒకటి రెండు విషయాల్లో ఇరు పార్టీల మధ్య సందిగ్ధత నెలకొందని, వాటి గురించి అధిష్టానంతో చర్చించి రేపటి లోగా ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు. 

సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు మద్దుతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బీజేపీ, ఆ పార్టీకి మద్దతు పలుకుతున్న మతతత్వ శక్తులను అడ్డుకునేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, భువనగిరి బరిలో నుంచి తమను విరమించుకోవాలని కాంగ్రెస్​ కోరిందని, ఈ విషయంలో తామింకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. సమావేశంలో సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారామయ్య, వీరయ్య, కాంగ్రెస్ తరఫున మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు పాల్గొన్నారు.