బీజేపీ స్లోగన్‌కు ప్రియాంక గాంధీ కొత్త నిర్వచనం

బీజేపీ స్లోగన్‌కు ప్రియాంక గాంధీ కొత్త నిర్వచనం

లాతూర్, న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న విమర్శలకు వెంటనే స్పందిస్తూ సూటిగా కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల మెడలో తాళిబొట్టు కూడా లాక్కుంటుందని మోదీ ఆరోపించడం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ప్రియాంక.. మహిళల తాళిబొట్టు లాక్కోవడం కాదు దేశం కోసం తన తల్లి తాళిబొట్టును త్యాగం చేసిందని కౌంటర్ ఇచ్చారు. తన నాయనమ్మ(ఇందిర) యుద్ధ నిధికి  బంగారం ఇచ్చేసిందని చెప్పారు. 

తాజాగా శనివారం మహారాష్ట్రలోని లాతూర్​లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభలో ప్రియాంక మాట్లాడుతుండగా బీజేపీ అభిమాని ఒకరు ‘అబ్​ కీ బార్’ అంటూ గట్టిగా అరిచాడు. దీనికి వెంటనే రియాక్టైన ప్రియాంక.. ‘జన్​తా కీ సర్కార్’ అంటూ జవాబిచ్చారు. ‘ఇప్పటి వరకు మీరు (జనం) అనుభవించిన కష్టాలు చాలు. ఈసారి ఆప్​(మీ) ప్రభుత్వం ఏర్పడాలి. మీ కష్టాలను తీర్చే ప్రభుత్వం రావాలి. ప్రజల కోసం ప్రజలతో నడిచే ప్రభుత్వమే రావాలి’ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ‘అబ్​కీ బార్ 400 కే పార్’ అంటూ బీజేపీ నినాదం ఎత్తుకున్న విషయం తెలిసిందే. ఈ నినాదానికి ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

మా మేనిఫెస్టోతో మోదీకి సమస్యేంటి?

కాంగ్రెస్ ఎక్స్​రే మెషీన్ పట్టుకొని తిరుగుతుందని, మంగళసూత్రాలతో సహా మీ సంపదను లాక్కొని వేరొకరికి పంచుతుందని ప్రధాని మోదీ ప్రజలను హెచ్చరిస్తున్నారని ప్రియాంకగాంధీ మండిపడ్డారు. వాస్తవానికి ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ​న్యాయ్​ మేనిఫెస్టోతో మోదీకి వచ్చిన సమస్యేంటని నిలదీశారు. తమ మేనిఫెస్టో చూసి మోదీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? అని చురకలంటించారు. బీజేపీ 400 సీట్లలో గెలిచి రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. మొదట ఆ పార్టీ దేన్నైనా ఖండిస్తుందని, అధికారంలోకి వచ్చాక ఆ ఎజెండానే అమలు చేస్తుందని అన్నారు. ‘మీరు చూడండి.. బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులు వివిధ సమావేశాల్లో తాము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పారు. దీన్ని ప్రధాని మోదీ ఖండించారు. వారి చరిత్ర చూసినట్టైతే పార్టీ ఏం చేయబోతున్నదో జూనియర్ నేతలు మొదట చెబుతారు. దాన్ని పార్టీ ఖండిస్తుంది. ఆ తర్వాత దాన్నే అమలు చేస్తుంది’  అని పేర్కొన్నారు. 

అర్బన్​ ప్రాంతాలకు ఉపాధి హామీ పథకం

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్బన్​ ప్రాంతాలకు కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి, నిరుపేద కుటుంబాలకు100 రోజుల పని కల్పిస్తామని ప్రియాంకా గాంధీ చెప్పారు. నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు, మత్స్యకారులకు డీజిల్​ సబ్సిడీ, కనీస వేతనం రూ.400, ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​, గిరిజనులకు స్పెషల్​ బడ్జెట్​ఇచ్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉన్నదని చెప్పారు. కేవలం ఎన్నికలప్పుడే ప్రధాని మోదీ గ్యాస్​ సిలిండర్​పై సబ్సిడీ ఇస్తారని, ఆయనకు ప్రజలపై కరుణ, జాలి లేదని మండిపడ్డారు. విద్య, ఆరోగ్యం, ధరల పెరుగుదలపై మోదీ ఎప్పుడూ మాట్లాడరని, ఆయనను మరో ఐదేండ్లు భరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేనైతే అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

మా నాన్న దేహం ముక్కలై ఇంటికొచ్చింది

‘ఈ దేశం కోసం మా నాన్న (రాజీవ్​గాంధీ) ప్రాణత్యాగం చేశారు. ముక్కలైపోయిన ఆయన శరీరాన్ని ఇంటికి తెచ్చుకున్నాం’ అని ప్రియాంక గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. రాజీవ్​గాంధీ తర్వాత, ఏబీ వాజపేయి, మన్మోహన్​సింగ్​లాంటి  ప్రధానులను చూశాం కానీ.. ప్రజలకు ఎవరూ అబద్ధాలు చెప్పలేదని అన్నారు. మంగళసూత్రాలు సహా ప్రజల సంపదను కాంగ్రెస్​ దోచుకుంటుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. ప్రజలకు బహిరంగంగా అబద్ధాలు చెప్పే మొదటి ప్రధాని మోదీనేనని విమర్శించారు. 

శనివారం ప్రియాంక గాంధీ గుజరాత్​లోని వల్సాడ్​  నియోజకవర్గం ధరంపూర్​ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. ‘దేశం కోసం మా నానమ్మ (ఇందిరా గాంధీ) జీవితాన్ని, మా నాన్న (రాజీవ్ గాంధీ) ప్రాణాలను త్యాగం చేశారు. బాంబుదాడిలో ముక్కలైన ఆయన శరీరాన్ని ఇంటికి తెచ్చుకున్నాం. మిగతా ప్రధానులు ఎవరూ కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పలేదు. వారందరికీ పూర్తిగా వ్యతిరేకంగా అబద్ధాలే తప్ప ప్రజలకు నిజాలు చెప్పాలని అనుకోని ప్రధాని మోదీ’ అని ప్రియాంక ఫైర్​ అయ్యారు.