కాంగ్రెస్ ​ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది

కాంగ్రెస్ ​ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
  • చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి

గచ్చిబౌలి/శంషాబాద్, వెలుగు : మైనార్టీల ఓట్లను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్​ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన కొండాపూర్ డివిజన్ లోని మార్తాండనగర్ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.

రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గాన్ని విడిచిపెట్టి కేరళలో ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్నచోట నుంచి పోటీ చేసి గెలవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్నివర్గాల ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నారని, దేశ వ్యాప్తంగా బీజేపీ 400కు పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. హఫీజ్ పేటలోని మార్తాండనగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొండాపూర్ మీదుగా కొత్తగూడ చౌరస్తా వరకు సాగింది.

అలాగే శనివారం శంషాబాద్ లో నిర్వహించిన బీజేపీ యువ మోర్చా యువ సమ్మేళనంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తన వెంట నాలుగు లక్షల ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయని సంబరపడుతున్నాడని, ఆయనకు యువకులంతా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.