కంబోడియా కేంద్రంగా సైబర్ ​నేరాలు

కంబోడియా కేంద్రంగా సైబర్ ​నేరాలు

సిరిసిల్ల టౌన్, వెలుగు: కంబోడియాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసంతో భారతీయులను రిక్రూట్​చేసుకుని సైబర్​నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. శనివారం సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామానికి చెందిన అతికం లక్ష్మి కొడుకు శివప్రసాద్.. జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయిప్రసాద్  అనే ఏజెంట్ కి ఉద్యోగం కావాలని చెప్పడంతో రూ.లక్షా 40 వేలు తీసుకుని కంబోడియాకు పంపించాడు. 

అక్కడున్న కంపెనీ శివప్రసాద్ ​పాస్ పోర్టును స్వాధీనం చేసుకొని అతనితో సైబర్  నేరాలు చేయిస్తోంది. ఇలా సుమారు 600 మంది భారతీయులను సైబర్  నేరగాళ్లు రిక్రూట్​ చేసుకుని బెదిరిస్తూ ఇండియాకే చెందిన వారి సొమ్ము కొల్లగొడుతున్నారు. ఆరు రోజుల క్రితం శివప్రసాద్  తన తల్లి లక్ష్మికి ఫోన్​చేసి విషయం చెప్పాడు. ఎలాగైనా తనను కాపాడాలని రోదించాడు. దీంతో ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరిసిల్ల టౌన్​ పోలీసులు కంబోడియాలోని భారతీయ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. 

అక్కడి పోలీసుల మద్దతుతో శివప్రసాద్ తో పాటు మిగిలిన బాధితులను కూడా కాపాడారు. వారు ఇండియాకు తిరిగి వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కంచర్ల సాయిప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. సాయిప్రసాద్​ రూ.10 వేల కమీషన్​ తీసుకుని లక్నోకి చెందిన సదాకత్  దగ్గరకు శివప్రసాద్ ను పంపాడు. సదాకత్  కూడా రూ.10 వేలు తీసుకుని పూణేలోని అబిద్ అన్సారీకి అప్పగించాడు. అబిద్  అన్సారీ.. బాధితుడిని బిహార్​కు చెందిన షాదాబ్​ దగ్గరకు పంపగా అతడు చివరకు కంబోడియా పంపాడు. ఇదంతా ఒక నెట్​వర్క్​లా నడుస్తోందనిఎస్పీ తెలిపారు.