- కేడీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ టౌన్, వెలుగు: జనవరిలో నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను సక్సెస్ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. రవాణా, ఆర్ అండ్ బీ, హెల్త్, ఆర్టీసీ, ఎక్సైజ్, పోలీస్, విద్య తదితర శాఖల అధికారులతో శనివారం కలెక్టరేట్లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
గతేడాది 2,800 మంది విద్యార్థులు ట్రాఫిక్ పార్కును సందర్శించేలా చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది సైతం ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. ఆర్టీసీ, స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలన్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(కేడీసీసీబీ) పర్సన్ ఇన్ చార్జిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవలి పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసినందున ఎంపీడీవోలు, ఎంపీవోలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టీసీ ఆర్ఎం రాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు.
