కరీంనగర్ సిటీ, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ డిస్ట్రిక్ట్ టీ-–20 లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆగమరావు, సెక్రటరీ మురళీధర్ రావు తెలిపారు. శనివారం నగరంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
సోమవారం మహబూబ్ నగర్ లో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుందన్నారు. మొదటి ఫేజ్ లో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 29 కొత్త జిల్లాల జట్లు తలపడుతాయని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల టీంలను హెచ్సీఏ ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ అలుగునూరు క్రికెట్ గ్రౌండ్ లో ఈ నెల 23 నుంచి నాలుగు రోజులపాటు కరీనగర్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల జట్లు పాల్గొంటాయన్నారు.
ప్రతిభ కనబరిచినవారితో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీంను ఎంపిక చేస్తారని తెలిపారు. విన్నర్ టీంకు రూ.5 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన టీంకు రూ.2 లక్షలు, నాలుగో స్థానంలో నిలిచిన టీంకు రూ.లక్ష క్యాష్ ప్రైజ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సహా మొత్తం రూ.15 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఐపీఎల్ తరహాలో లైవ్ టెలికాస్ట్ ఉంటుందన్నారు.
ఈ టోర్నమెంట్ తర్వాత కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుకుమార్ రావు మెమోరియల్ కరీంగనర్ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించబోతున్నామని తెలిపారు. దీనికి విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేస్తోందన్నారు. ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, ట్రెజరర్శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు సాగర్ రావు, హరికృష్ణ తదితరులున్నారు.
